పాత ఫైళ్లపైకొత్త సంతకాలు.. కొత్త సెక్రటేరియెట్‌లో ఏదో చేసినట్లు సర్కారు హడావుడి

పాత ఫైళ్లపైకొత్త సంతకాలు.. కొత్త సెక్రటేరియెట్‌లో ఏదో చేసినట్లు సర్కారు హడావుడి
  • పాత ఫైళ్లపైకొత్త సంతకాలు
  • కొత్త సెక్రటేరియెట్‌లో ఏదో చేసినట్లు సర్కారు హడావుడి
  • ఎన్నోసార్లు ఆదేశాలిచ్చి, అమలు చేయాలని చెప్పిన వాటిపై ఇప్పుడు సైన్లు
  • సీఎం నుంచి  మంత్రుల దాకా ఇదే తీరు

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్‌‌తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అయితే అవన్నీ పాత ఫైళ్లే కావడం గమనార్హం. ఒకటీ రెండు మినహా మిగతావన్నీ ఇంతకు ముందు ఆదేశాలు ఇచ్చినవే ఉన్నాయి. ప్రతిసారి రొటీన్‌గా వెళ్లాల్సిన ఫైల్స్​పై కూడా కొత్తగా ఏదో చేస్తున్నట్లు సంతకాలు చేశారు. సెక్రటేరియెట్ ప్రారంభించిన తర్వాత ఆరో ఫ్లోర్​లో సీఎం కేసీఆర్ తన లక్కీ నంబర్ 6 ప్రకారం ఆరు ఫైళ్లపై సైన్లు పెట్టారు. దళితబంధు, పోడు పట్టాలు, సీఎంఆర్ఎఫ్, న్యూట్రిషన్ కిట్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటివన్నీ పాతవే. మంత్రులు చేసిన సంతకాలు చేసిన ఫైల్స్ కూడా అట్లనే ఉన్నాయి.

రొటీన్ వ్యవహారానికే కొత్త బిల్డప్

దళితబంధు: 2023-–24లో దళిత బంధు పథకం అమలుకు సంబంధించిన ఫైలుపై సీఎం తొలి సంతకం చేశారు. దళిత బంధు ఒక విడత ఇప్పటికే పూర్తయింది. ఏడాదిగా ఈ స్కీంకు సంబంధించి పలుమార్లు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆదివారం సంతకం చేశారు. దీనికి సీఎం సిగ్నేచర్ కాకుండా సంబంధిత సెక్రటరీ నుంచి మార్గదర్శకాల జీవో ఇస్తే సరిపోతుంది. పోడు భూములు: పోడుభూముల పట్టాల పంపిణీపైనా సీఎం సంతకం చేశారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం మార్చి నెలలోనే పోడు పట్టాల పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు మే నెల నుంచి జిల్లాలవారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందజేయనున్నారు.

సీఎంఆర్ఎఫ్: సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద కేసీఆర్ సంతకం చేశారు. ఇది ఎప్పుడూ రొటిన్​గా వెళ్లే ఫైల్ మాత్రమే.


కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు: గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సిగ్నేచర్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో ఈ స్కీం అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమైన కిట్లు కొనుగోలు చేయడానికి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్లు కూడా పిలిచింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పలుమార్లు వెల్లడించారు.

ఒకట్రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా కిట్ల పంపిణీ మొదలవుతుందని ఏప్రిల్ 20న మంత్రి ప్రకటన చేశారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించామని, మరో లక్ష కిట్లు సేకరిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఇప్పుడే ఈ స్కీమ్‌కు సీఎం కేసీఆర్‌‌ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఆదివారం మంత్రి ఆఫీస్ నుంచి ఓ నోట్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 6.84 లక్షల మందికి కిట్లు ఇస్తామని, ఇందుకోసం రూ.277 కోట్లు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు.


కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గతేడాదే ప్రకటన చేశారు. అన్ని ప్రతిపాదనలు ఎప్పుడో ప్రభుత్వానికి చేరాయి. ఇందుకోసం కేవలం ఫైనాన్స్ నుంచి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంది. దీనికి సీఎం సంతకం అవసరం లేకున్నా పెట్టారు. దీంట్లోనూ సగం మందికి రెగ్యులరేజేషన్ చేయకపోవడం గమనార్హం.


పాలమూరు లిఫ్ట్: పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పాతదే. కాకపోతే సీఎం కచ్చితంగా సైన్ చేయల్సిన ఫైల్ కావడంతో.. ఈ సందర్భంగా పూర్తి చేశారు.

మంత్రులూ సీఎం దారిలోనే


మంత్రులు ఒక్కో ఫైల్‌పై సంతకాలు చేశారు. అవి కూడా పాతవే. మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉచిత విద్యుత్ బకాయిలు రూ.958 కోట్లు డిస్కంలకు చెల్లించే ఫైల్​పై సంతకం పెట్టారు. ఇది రొటీన్ ఫైల్. సంబంధిత శాఖ సెక్రటరీ జీవో ఇస్తే సరిపోయేది. ప్రతి ఏడాది ఇచ్చే సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాల సరఫరా ఫైలుపై నిరంజన్ రెడ్డి సిగ్నేచర్ పెట్టారు. చేప పిల్లల పంపిణీ కూడా అదే కోవకు చెందినది. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతకం చేశారు. మెగా డెయిరీ నిర్మాణ పనుల కోసం రూ.75 కోట్ల గ్రాంట్ ఇవ్వాల్సిన దానిపై మంత్రి సిగ్నేచర్ చేశారు. కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలుపై ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తొలి సంతకం చేశారు. ఇది పాత ముచ్చటే. జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లోని 100 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైల్​పై ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు. 

ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైల్​పైనా సిగ్నేచర్ చేశారు. ఈ రెండు కూడా పాత హామీలే. రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైల్​పై వేముల ప్రశాంత్ రెడ్డి సంతకం పెట్టారు. అయితే దీనికి సంబంధించిన నిర్ణయం రెండు నెలల కిందటే జరిగిపోయింది. బడులు తెరిచే నాటికి టీచర్లకు ట్యాబులు, కార్నర్ లైబ్రరీలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేశారు. అంగన్​వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీతో పాటు రాంజీగోండు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు ఇస్తూ ఫైల్స్ పై మంత్రి సత్యవతి రాథోడ్ సంతకం చేశారు. సీఎం కప్పు.. క్రీడలకు సంబంధించిన ఫైల్​పై శ్రీనివాస్​గౌడ్ సంతకం పెట్టారు. మంత్రి హరీశ్​రావు మాత్రమే వైద్యారోగ్య శాఖలో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన కొత్త ఫైల్‌పై సంతకం పెట్టారు.