- ఎమ్మెల్యే చిన్నయ్య పై ..నో యాక్షన్
- లైంగిక వేధింపుల ఆరోపణలపై సర్కారు సైలెన్స్
- నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న సీఈవో షేజల్
- చిన్నయ్యకు కేటీఆర్ క్లీన్‌చిట్‌తో మనస్తాపం..
- మూడోసారి సూసైడ్ అటెంప్ట్
మంచిర్యాల, వెలుగు: ఆరిజిన్ డెయిరీ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సర్కార్ ఈగ వాలనివ్వడం లేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తమ దగ్గర రూ.30 లక్షలు తీసుకొని మోసం చేశారని, రైతులతో అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ ఆరిజిన్ డెయిరీ సీఈవో షేజల్ నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లోని తన ఫ్లాట్‌లో, మరోసారి ఢిల్లీలో సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆమె గురువారం హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం రేపింది. దీంతో దుర్గం చిన్నయ్య వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి మరోసారి రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
డెయిరీకి ఏర్పాటుకు సహకరిస్తానని మోసం..
హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆదినారాయణ, షేజల్ నిరుడు బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సంప్రదించారు. ఆయన తన బామ్మర్దికి వాటా ఇస్తే డెయిరీకి సహకరిస్తానని చెప్పగా అందుకు ఒప్పుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీ శివారులో బీఎంసీయూ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చిన్నయ్య దగ్గరుండి భూమిపూజ చేశారు. ఆ తర్వాత డెయిరీ నిర్వాహకులు పాడి రైతుల దగ్గర మెంబర్‌షిప్‌కోసం ఒక్కో గేదెకు రూ.708 చొప్పున వసూలు చేశారు. అలాగే రైతులు రూ.3.50 లక్షలు చెల్లిస్తే డెయిరీ నుంచి రూ.6.50 లక్షలు లోన్ ఇచ్చి 10 గేదెలు కొనిస్తామని మరికొందరు రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇలా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు..
ఆదినారాయణ, షేజల్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతూ హైదరాబాద్‌నుంచి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు రిలీజ్ చేశారు. బిజినెస్ విషయాల్లో చర్చించడానికి పలుమార్లు హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు పిలిస్తే వెళ్లామని, అక్కడ మందు పార్టీ ఏర్పాటు చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు బ్రోకర్ల ద్వారా కొంతమంది అమ్మాయిలను ఆయన క్వార్టర్‌కు పంపించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆదినారాయణతో చేసిన వాట్సాప్ చాటింగ్స్ర్కీన్షాట్లను, ఎమ్మెల్యే దగ్గరికి పంపిన అమ్మాయిల ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ గోడు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని మనస్తాపం చెందిన ల్యాంకో హిల్స్‌లోని తన ఫ్లాట్‌లో టాయ్‌లెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు హాస్పిటల్‌కు తరలించడంతో కోలుకున్నారు.
ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు..
ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులపై రాష్ర్ట ప్రభుత్వం స్పందించకపోవడంతో షేజల్ నెలరోజులుగా ఢిల్లీలో తన ఆందోళన కొసాగించారు. చిన్నయ్యపై నేషనల్విమెన్ కమిషన్‌కు కంప్లయింట్ చేయగా, రిపోర్టు ఇవ్వాలని రాష్ర్ట పోలీసులను ఆదేశించింది. అలాగే షేజల్ జంతర్‌మంతర్ వద్ద, ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్‌వద్ద దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఢిల్లీలో పురుగుల మందు తాగి మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేయగా పోలీసులు ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చివరకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ భవన్ వద్ద దీక్ష చేపట్టారు. కేటీఆర్సూచన మేరకు ఎంపీలు సురేశ్‌రెడ్డి, వెంకటేశ్‌నేత తదితరులు షేజల్తో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా తనకు డబ్బులు ఇవ్వకున్నా ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని షేజల్ మీడియాతో వాపోయారు.
రూ.30లక్షలు తీసుకుని కేసులు పెట్టించిండు..
ఎమ్మెల్యే చిన్నయ్య పలు దఫాలుగా తమ దగ్గర రూ.30 లక్షలు తీసుకుని కన్నాల శివారులో రెండెకరాల ప్రభుత్వ భూమిని డెయిరీకి కేటాయించి మోసం చేశారని ఆదినారాయణ, షేజల్ ఆరోపించారు. ఈ విషయంలో తాము ప్రశ్నించినందుకు కక్షపెంచుకుని రైతులను మోసం చేశారని బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ పోలీస్స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తాము ఇచ్చిన డబ్బులతోనే ఎమ్మెల్యే చిన్నయ్య కన్నాలలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో గృహప్రవేశం చేశారని ఆరోపించారు. రైతులను మోసం చేసిన కేసుల్లో ఆదినారాయణ, షేజల్‌ను బెల్లంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిద్దరూ దాదాపు నెల రోజులు ఆదిలాబాద్ జైల్లో ఉండి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వేధింపులపై బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ కామెంట్లతో మనస్తాపం..
మూడ్రోజుల కింద మంత్రి కేటీఆర్ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని క్లీన్చిట్ ఇవ్వడాన్ని షేజల్ జీర్ణించుకోలేకపోయారు. మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నప్పటికీ చిన్నయ్యను వెనకేసుకు రావడంతో మనస్తాపం చెందారు. ఇక ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్తో తనకు న్యాయం జరిగే అవకాశం లేదని సూసైడ్ నోట్ రాసిన శేజల్ గురువారం హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి దగ్గరలో మరోసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే చేసిన ద్రోహంపై ఒక మహిళ నాలుగు నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నిజాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
