100వ మ్యాచ్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్.. అయినా జర్మనీ చేతిలో భారత్ ఓటమి!

100వ మ్యాచ్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్.. అయినా జర్మనీ చేతిలో భారత్ ఓటమి!

FIH Hockey Pro League: రోటర్‌డామ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్ (FIH Hockey Pro League 2025-26) ఉత్కంఠభరిత పోరులో భారత పురుషుల హాకీ జట్టు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జర్మనీతో గట్టిగా పోరాడిన భారత్, చివరి నిమిషాల్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో 1–2 తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్‌రాజ్ సింగ్ (38వ నిమిషంలో) గోల్ చేయగా.. జర్మనీ ఆటగాళ్లు జస్టస్ వీగాండ్ (56'నిమిషాం వద్ద), జాకబ్ బ్రిల్లా (60' నిమిషాం వద్ద) చెరో గోల్ కొట్టి మ్యాచ్‌ను జర్మనీ వైపు తిప్పేశారు.

జుగ్‌రాజ్ సింగ్ 100వ మ్యాచ్ రికార్డ్: 
మ్యాచ్ ప్రారంభం నుంచి టీమిండియా చాలా దూకుడుగా ఆడింది. బంతిపై నియంత్రణ సాధిస్తూ, పటిష్టమైన డిఫెన్స్‌తో వరల్డ్ ఛాంపియన్ జర్మనీకి ఎలాంటి గోల్స్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. సెకండ్ క్వార్టర్‌లో అభిషేక్ మంచి మూవ్స్ క్రియేట్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. కానీ, థర్డ్ క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత డ్రాగ్-ఫ్లిక్కర్ జుగ్‌రాజ్ సింగ్ పవర్‌ఫుల్ షాట్‌తో గోల్‌గా మార్చి 38వ నిమిషంలో భారత్‌ని లీడ్ లోకి తీసుకెళ్లాడు. తన కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న జుగ్‌రాజ్.. ఈ మైల్‌స్టోన్‌ను గోల్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జర్మనీ చేసిన గోల్ ప్రయత్నాలను భారత కీపర్ మోహిత్ హెచ్ఎస్ అడ్డుకున్నాడు.

చివరి నాలుగు నిమిషాల్లో జర్మనీ మైండ్ గేమ్: 
ఫోర్త్ క్వార్టర్‌లో భారత్‌కు లీడ్ పెంచుకునే ఛాన్స్ వచ్చినప్పటికీ శిలానంద్ లక్రా దాన్ని మిస్ చేశాడు. మ్యాచ్ ముగియడానికి కేవలం 4 నిమిషాలు ఉందనగా జర్మనీ అసలైన గేమ్ స్టార్ట్ చేసింది. తత56వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ ప్లేయర్ జస్టస్ వీగాండ్ గోల్‌గా మార్చి స్కోరును సమయం చేయడంతో.. మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది అనుకుంటున్న తరుణంలో, ఆఖరి సెకన్లలో (60వ నిమిషంలో) జర్మనీకి మరో పెనాల్టీ కార్నర్ దొరికింది. దీనిని జాకబ్ బ్రిల్లా గోల్ పోస్ట్‌లోకి పంపి జర్మనీకి 2–1తో సంచలన విజయాన్ని అందించాడు. గెలిచే మ్యాచ్‌ను చివరి నిమిషాల్లో చేజార్చుకోవడంతో భారత హాకీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ALSO READ : ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ రెడీనా?