క్యూ న్యూస్​పై దాడి చేసినోళ్ల ఆచూకీ దొరకలె : మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

క్యూ న్యూస్​పై దాడి చేసినోళ్ల ఆచూకీ దొరకలె  : మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

మేడిపల్లి, వెలుగు: క్యూ న్యూస్​ మీడియా ఆఫీసుపై దాడికి పాల్పడ్డ నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి తెలిపారు. ఆదివారం కొందరు దుండగులు తీన్మార్​ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ మీడియా ఆఫీసుపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న క్యూ న్యూస్ పై దాడి విషయంలో పోలీస్​ డిపార్ట్​మెంట్​ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీకి తోక సంస్థగా వ్యవహరిస్తున్నదని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. సోమవారం మేడిపల్లిలో మల్లన్న మీడియాతో మాట్లాడారు.

 క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడికి పాల్పడుతూ పట్టుబడ్డ సాయి కిరణ్ గౌడ్ పై కూడా కేసు నమోదు చేయకపోవడం పోలీసుల పక్షపాత వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. ‘‘క్యూ న్యూస్ పై దాడి ఘటనలో ఎటువంటి చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకుంటదంటే.. నమ్మశక్యమైన విషయమేనా?. పేపర్ల లీక్​పై సిట్ ఏర్పాటు.. ప్రజలను మభ్యపెట్టాడానికే తప్ప దాంతో నిరుద్యోగులకు జరిగే న్యాయం ఏమీ లేదు” అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతాలు తీసుకునే పోలీసులు ఇప్పటికైనా చట్ట ప్రకారం వ్యవహరించి ప్రజల పక్షాన మాట్లాడే వారికి న్యాయం చేయాలన్నారు.