టీడీపీకి పోటీగా ఎన్టీఆర్​ను ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్

టీడీపీకి పోటీగా ఎన్టీఆర్​ను ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్
  • ఉద్యమ టైంలో, రాష్ట్రం వచ్చాక పట్టించుకోని గులాబీ పార్టీ  
  •     రామారావు శత జయంతి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు
  •     ఆయనకు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్‍ అంటూ మంత్రుల కామెంట్లు
  •     తెలంగాణ పై టీడీపీ ఫోకస్ పెట్టడంతోనే....
  •     సెటిలర్లు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు పోకుండా బీఆర్ఎస్​జాగ్రత్తలు  

హైదరాబాద్/వరంగల్, వెలుగు : ఎలక్షన్ ఇయర్​లో బీఆర్ఎస్​ ఎన్టీఆర్​జపం చేస్తోంది. ఆయన శత జయంతి కూడా ఈ ఏడాదే కావడంతో నేతలు ఆయనను ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లపై కన్నేసింది. ఇందుకోసం ఎన్టీఆర్ ​బ్రాండ్ ను వాడుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ఇందు కోసం నేరుగా పార్టీ ఇన్ వాల్వ్ కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లను రంగంలోకి దించింది. సెటిలర్ల  ఓట్లు టీడీపీ వైపు టర్న్ కాకుండా గట్టిగానే ప్రయత్నిస్తోంది.  ఎన్టీఆర్ ​విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఆయన అభిమానులు టీడీపీ వైపు చూడకుండా చేస్తోంది. ఉద్యమ సమయంలో ఆయన విగ్రహాలకు ముసుగులేశారని, మరికొన్ని చోట్ల చెప్పుల దండలు  కూడా వేశారని..అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో హఠాత్తుగా సీన్​ మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి జయంతి, వర్ధంతి సందర్భంగా ఎన్‍టీఆర్‍ విగ్రహాలకు కనీసం పూలదండలు కూడా వేయని మంత్రులు, ఎమ్మెల్యేలు, గులాబీ లీడర్లు ఆదివారం మాత్రం నివాళులర్పించేందుకు పోటీలు పడ్డారు. ఎన్‍టీఆర్ యుగ పురుషుడని.. పరిపాలనాదక్షుడని.. తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహానుభావుడని ఆకాశాకెత్తారు. పనిలోపనిగా ఎన్‍టీఆర్‍ నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్‍ మాత్రమే అని మంత్రులు, ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు.   

ఖమ్మంలో ఎన్‍టీఆర్‍ భారీ విగ్రహంతో..

ఖమ్మం జిల్లాలో ఓ సామాజిక వర్గ ఓట్ల కోసం అక్కడి అధికార పార్టీ లీడర్లు ఏకంగా ఎన్‍టీఆర్‍ భారీ విగ్రహ ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనివల్ల ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ గంప గుత్తగా తమకే పడతాయని భావించారు. ఖమ్మం లకారం చెరువులో ఏకంగా 54 అడుగుల విగ్రహం పెట్టేలా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‍ కుమార్‍తో పాటు లోకల్‍ బీఆర్‍ఎస్‍  లీడర్లు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఎన్‍టీఆర్‍ శతజయంతి ఉత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని చూశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్​ను  ఆహ్వానించారు. అయితే, అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో యాదవ సంఘాలు, ఇతరులు పిటిషన్లు ఫైల్ ​చేయడంతో విగ్రహావిష్కరణపై స్టే విధించింది. దీంతో కార్యక్రమం వాయిదా పడింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ తో టీడీపీ జట్టు కట్టి మహాకూటమిగా ఏర్పడింది. కూకట్ పల్లిలో హరికృష్ణ కుమార్తె సుహాసినిని చంద్రబాబు పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో తమ సోదరి కోసం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేయలేదు. వచ్చే ఎన్నికల్లోనూ కూకట్​పల్లి నుంచి మళ్లీ సుహాసినినే బరిలోకి దించాలని చూస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్​ను  ఆహ్వానించి ఆయన మద్దతు బీఆర్​ఎస్​కే ఉందని చెప్పుకునే ప్రయత్నాలను బీఆర్ఎస్ చేసింది. కోర్టు జోక్యంతో దీనికి బ్రేక్ పడింది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జూనియర్ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే తెలంగాణలో బాలకృష్ణను రంగంలోకి దించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు ట్రస్ట్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపై టీడీపీ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తు వర్కవుట్
కావడంతోనే ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు తొమ్మిది సీట్లు ఆయా పార్టీలు గెలుచుకున్నాయి. చంద్రబాబు వస్తే తెలంగాణ ప్రాజెక్టులు మూలన పడుతాయని కేసీఆర్ ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం కాంగ్రెస్ కు నష్టం చేసినా ఖమ్మం జిల్లా వరకు ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. పార్టీ పేరు మార్పుతో రేపు ఈ తరహా ప్రచారం చేసే అవకాశాన్ని కేసీఆర్ కోల్పోయారు. ఇదే అదనుగా ఖమ్మం నుంచే తెలంగాణలో టీడీపీకి మళ్లీ ఊపిరి పోసే ప్రయత్నాలకు చంద్రబాబు తెరతీశారు. ఈ ప్రాంతంలో మళ్లీ టీడీపీకి పట్టు చిక్కకుండా ఉండాలంటే ఎన్టీఆర్​బ్రాండ్ ఒక్కటే రెమెడీ అని ప్రగతి భవన్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇలా...

రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు హనుమకొండ పోలీస్‍ హెడ్‍క్వార్టర్‍ ముందుండే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రబెల్లి టీడీపీని వీడాక మధ్యలో ఏనాడు జయంతి, వర్ధంతిల్లో పాల్గొనలేదు. కొన్ని రోజులుగా మాత్రం ఎక్కడ మీటింగ్‍ జరిగినా ఎన్‍టీఆర్‍ జపం చేస్తున్నారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో కేవలం ఎన్‍టీఆర్‍, కేసీఆర్ మాత్రమే ఇష్టమైన నేతలని చెబుతున్నారు. పనిలోపనిగా ఎన్‍టీఆర్‍ అసలు రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్‍ అంటూ ఆకాశానికి ఎత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యమ పోరును తట్టుకుని టీడీపీ నుంచి గెలిచిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం చాలా ఏండ్ల తర్వాత ఎన్‍టీఆర్‍ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ​కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా ఎన్టీఆర్​అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెటిలర్ల ప్రభావం తక్కువగా ఉండే మంథని నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కూడా ఎన్టీఆర్ ​విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలే అట్టహాసంగా ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ​ఘాట్ కు మంత్రులు, గులాబీ నేతలు క్యూ కట్టారు. ఎన్టీఆర్ ​యుగ పురుషుడని మంత్రి తలసాని కామెంట్ చేశారు.