కేసీఆర్ తీరుతో కేడర్ బేజార్!.. రెండేళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు..అసెంబ్లీకి డుమ్మా

కేసీఆర్  తీరుతో  కేడర్ బేజార్!.. రెండేళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు..అసెంబ్లీకి  డుమ్మా
  • రెండేండ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిన కేసీఆర్​
  • ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్​హౌస్​కు.. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా
  • కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ
  • అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడమేంటని నిరుత్సాహం
  • బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న
  • ఇదంతా సెల్ఫ్​ గోల్​ చేసుకోవడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు

హైదరాబాద్​, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్​ తీరు ఆ పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌కు నిరాశే మిగుల్చుతున్నది. ఎప్పుడో ఒకసారి బయటకు రావడం.. ఏదో చేసేస్తానని మాటలు చెప్పడం తప్ప చేతల్లో చేస్తున్నది ఏమీ లేదని నిరుత్సాహ పడుతున్నది. ఇటీవల దాదాపు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్​.. ‘తోలుతీస్తా.. ఇకవస్తున్నా’ అంటూ  స్టేట్​మెంట్లు ఇవ్వడంతో లీడర్లు, ‘సింహం వస్తున్నదంటూ’ కేడర్​ మస్తు జోష్​లో మునిగిపోయారు.  కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జోష్​ కాస్తా నీరుగారిపోయింది. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చిన కేసీఆర్​.. ఒక్క సంతకం పెట్టేసి మళ్లీ ఫామ్​హౌస్​ బాట పట్టారు. సరే కృష్ణా జలాలపై చర్చలోనైనా పార్టీ లీడర్లు పాల్గొని గట్టి కౌంటర్​ ఇస్తారని భావించిన శ్రేణులకు రెండోరోజే గట్టి షాక్​ తగిలింది. సభ ప్రారంభమైన గంటకే సమావేశాలను బాయ్​కాట్​ చేస్తున్నామంటూ నినాదాలు చేస్తూ బీఆర్‌‌ఎస్‌ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్​ ప్రభుత్వానికి  ధీటుగా సమాధానం చెప్తారని భావించిన పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి.

కీలక సమయంలో బయటకు..

తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ‘నీళ్లు’ అత్యంత కీలకమైనవని చాలా సందర్భాల్లో ఇటు కేసీఆర్‌‌తోపాటు బీఆర్‌‌ఎస్​ నేతలు చెబుతుంటారు. అసలు నీళ్లపై మాట్లాడాలంటే తానే ఎక్స్‌పర్ట్​ అనేలా కేసీఆర్​ ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకునేవారు. కానీ, తీరా కృష్ణా జలాల పంపిణీ, పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యంలాంటి అత్యంత కీలకమైన అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ.. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన సభలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సభకు వచ్చి కేసీఆర్‌‌ సమాధానం చెప్పాలని అధికారపక్ష నేతలతో పాటు సొంత కూతురు కవిత కూడా డిమాండ్​ చేశారు. కానీ, కేసీఆర్‌‌ మాత్రం సభకు రాలేదు. ఫాంహౌస్​కు వెళ్లేముందు హరీశ్‌ రావును డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​గా నియమించారు. నీళ్లపై చర్చల భారం ఆయనపైనే మోపారు. తీరా చర్చ పెట్టిన రోజు ఆ అవకాశం లేకుండానే బయటకొచ్చేయడంతో పార్టీలోని కొందరు నేతలు, కేడర్​ కొంత నైరాశ్యంలోకి వెళ్లిపోయారన్న చర్చ జరుగుతున్నది.  

బయట పీపీటీలే ముద్దు

వాస్తవానికి అసెంబ్లీలో నీళ్లపై చర్చ పెడితే.. ప్రభుత్వం పవర్‌‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తే.. తమకూ పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్‌‌ఎస్​ డిమాండ్​ చేసింది. పీపీటీ అవకాశం లేకపోయినా.. ప్రభుత్వం చెప్పే అంశాలకు అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు ఆ పార్టీ నేతలకు అవకాశం ఉండేది.  అలా కాకుండా.. సభను బాయ్​కాట్​ చేశారు. కేసీఆర్‌‌ ఆర్డర్‌‌ వేయడంతోనే పార్టీ సభ్యులంతా కట్టకట్టుకుని బయటకు వచ్చారని చర్చ జరుగుతున్నది. తాజాగా, కాంగ్రెస్​ పార్టీనే కృష్ణా జలాల్లో తీరని ద్రోహం చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. పీపీటీ ఇస్తే మంచిదేగానీ.. కనీసం అసెంబ్లీలో ఉండి బీఆర్‌‌ఎస్​ గళాన్ని వినిపిస్తే బాగుండేది కదా అన్న వాదనలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సభలో మాట్లాడితే ఆన్​ రికార్డ్​ ఉంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం డేటాను బయటపెడితే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టినట్టు ఉండేది కదా? అని వాదిస్తున్నారు.  

సెల్ఫ్​గోల్​ అంటున్న విశ్లేషకులు..

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్​ సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు సభల తేదీలు, వేదికలు ఖరారు కాలేదు. నిజంగా కాంగ్రెస్​ ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తుందనుకుంటే.. బహిరంగసభలు పెట్టడంతోపాటు కేసీఆర్​ స్వయంగా అసెంబ్లీలో గట్టిగా కౌంటర్​ ఇస్తే పార్టీ వాదనలకు బలం చేకూరేది కదా అన్న అభిప్రాయాలు పార్టీ కేడర్​లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్​ ఎంత సేపు మాట్లాడితే అంత సేపు సమయం ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో.. కేసీఆర్​ మాట్లాడితే అధినేత వ్యాఖ్యలకు మరింత బలం చేకూరేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్​ రాకపోవడం, అసెంబ్లీలో బీఆర్‌‌ఎస్​ సభ్యులు లేకపోవడం.. పార్టీకి నష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది బీఆర్‌‌ఎస్​కు ఒకరకంగా సెల్ఫ్​గోల్​ లాంటిదని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం హాజరుకాకపోవడంతో.. కాంగ్రెస్​ చేసిన ఆరోపణలకు సభసాక్షిగా బలం చేకూరిందన్న చర్చ జరుగుతున్నది. సభలో కౌంటర్​ ఇవ్వకుండా బయట మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.