
గండిపేట, వెలుగు : గ్రేటర్‌పరిధిలో బీఆర్ఎస్హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్పరిధిలో మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ లీడర్ మిత్ర కృష్ణ 9.36 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందులో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలను గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బుధవారం కూల్చివేశారు. సదరు స్థలం ప్రభుత్వానికి చెందినదని తెలియజేస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
మంత్రి, కలెక్టర్ అండతో..
గండిపేట మండలం బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నంబర్51లో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సదరు స్థలాన్ని కొట్టేయాలని జియాగూడ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ లీడర్ మిత్ర కృష్ణ ప్లాన్చేశాడు. అప్పటి మంత్రి అండదండలతో, కలెక్టర్ సహకారంతో కబ్జా చేశాడు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, పాస్ పుస్తకాలు పొందాడు. మొన్నటి దాకా బీఆర్ఎస్అధికారంలో ఉండడంతో ఈ విషయం బయటికి రాలేదు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 51లోని 9.36 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం గుడిసెలను, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీని నేలమట్టం చేశారు.