
- బీఆర్ఎస్ ‘కరీంనగర్ లోక్‌సభ స్థానం’ సమీక్షలో నేతల ఆవేదన
- హైకమాండ్‌ను నేరుగా కలిసే చాన్స్ లేకుండె
- ఇంకా ఇట్లనే ఉంటే గడ్డు పరిస్థితులు తప్పవని వ్యాఖ్య
- కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తామని కేటీఆర్, హరీశ్ హామీ
- మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరు: గంగుల
- తాము కేసీఆర్‌కు సూసైడ్ స్క్వాడ్స్ మని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లకు పైగా అధికారంలో ఉన్నా కేడర్‌ను కనీసం పట్టించుకోలేదని, ఆ ఫలితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అని పార్టీ నాయకులు తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ లోక్‌సభ స్థానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులను ఈ సమీక్ష సమావేశంలో నేతలు ఏకరువు పెట్టారు. ఇకనైనా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘మొన్నటి వరకు అధికారంలో ఉన్నాం.. గ్రామ, మండల స్థాయిలో పార్టీ పదవులు ఉండవు... జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉంటాడు.. వేరే లీడర్లకు పదవులు లేవు.. ఎమ్మెల్యేలే సుప్రీం అంటే వాళ్లెవరూ కార్యకర్తలను పట్టించుకోలేదు.. హైదరాబాద్‌కు వచ్చినా పార్టీ హైకమాండ్‌ను నేరుగా కలిసే చాన్స్‌లేదు.. దీంతో పేరుకు వేలాది మంది కార్యకర్తలు ఉన్నా ఎవరూ సరిగా పని చేయలేదు.. కేసీఆర్ అంటే అభిమానం ఉన్నా ఎమ్మెల్యేల తీరుతో పని చేయలేకపోయారు..” అని పలువురు నాయకులు వివరించారు.
సోషల్‌మీడియా వింగ్బలహీనంగా ఉందని, కాంగ్రెస్‌కు సరిగా కౌంటర్చేయలేదని, రానున్న రోజుల్లో పరిస్థితి ఇట్లనే ఉంటే ఇంకా గడ్డు పరిస్థితులు తప్పవని వ్యాఖ్యానించారు. పార్టీని బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఇకపై ఏ ఎన్నికల్లోనైనా పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులను సంప్రదించిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. కరీంనగర్లోక్సభ నియోజకవర్గం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్అభ్యర్థులు గెలిచినా ఆ పార్టీ కన్నా 5 వేలకు పైగా ఓట్లు బీఆర్ఎస్కే ఎక్కువ వచ్చాయని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో బూత్‌నుంచి అదనంగా వంద ఓట్లు వేయిస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని అన్నారు.
మా ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరు: గంగుల
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరని, కేసీఆర్ తమ ఇంటి పెద్ద అని, కేసీఆర్‌కు తాము సూసైడ్ స్క్వాడ్స్మని మాజీ మంత్రి, కరీంనగర్ఎమ్మెల్యే గంగుల కమలాకర్అన్నారు. గురువారం కరీంనగర్ లోక్‌సభ స్థానం సమీక్ష అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి కోసం రాజగోపాల్‌రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్నుంచి ఒక్కరు కాంగ్రెస్‌లోకి పోయినా.. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలతో పది మంది వస్తారు. కేవలం నెల రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని విమర్శించడం కాదు.. వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని సమీక్ష సమావేశంలో లీడర్లు సూచించారని, త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం తమ పార్టీ క్యాడర్ కసిగా పని చేస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలు 9వ తేదీన అమలు చేస్తామన్నది తాము కాదని, కాంగ్రెస్ పార్టీనే అన్నదని మంత్రి శ్రీధర్ బాబు గుర్తించాలని దుయ్యబట్టారు. ‘‘ఇంకా రైతుబంధు పడలేదు.. రూ.2 లక్షల రుణమాఫీ అన్నరు.. రైతులకు బోనస్ ఇస్తామన్నరు.. రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నరు.. రైతులకు పంట సీజన్ ఎత్తిపోతుంది.. మిగతా హామీల గురించి మేం మాట్లాడుతలేం. రైతుబంధు, పింఛన్లు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం.. బీజేపీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న ముగ్గురిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే.. వాళ్లు మమ్మల్ని కూకటివేళ్లతో పెకిలించడం కాదు.. వాళ్లనే మేం పెకిలించాం..” అని గంగుల అన్నారు.