ఇవాళ్టి(ఫిబ్రవరి28) నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవీ వ్యాక్సిన్

ఇవాళ్టి(ఫిబ్రవరి28) నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవీ వ్యాక్సిన్
  • 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న బాలికలకు ఫ్రీ టీకా
  • రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందికి పంపిణీ
  • బాలికలు ఖాళీ కడుపుతో రావొద్దు.. తినేసి రావాలి 
  • బలవంతం లేదు.. పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే టీకా
  • అజ్మీర్​లో మోదీ.. కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠిలో ప్రారంభించనున్న మంత్రి దామోదర  
  • స్కూళ్లు, అంగన్​వాడీలు, పీహెచ్​సీల్లో 
  • అందుబాటులో టీకాలు 
  • మూడు నెలలు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ 

హైదరాబాద్, వెలుగు: మహిళల ప్రాణాలను బలి తీసుకుంటున్న గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)ను అంతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌‌పీవీ) వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాజస్థాన్‌‌ లోని అజ్మీర్ లో ప్రధాని మోదీ ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌‌ గా ప్రారంభించనుండగా.. రాష్ట్రంలో హైదరాబాద్ కింగ్‌‌ కోఠి దవాఖానలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

బయట ప్రైవేటు హాస్పిటల్స్ లో దాదాపు రూ. 5 వేల వరకు ఖరీదు చేసే గార్డాసిల్–4 వ్యాక్సిన్‌‌ ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏండ్లు నిండి, 15 ఏండ్లలోపు ఉన్న సుమారు 3.50 లక్షల మంది బాలికలకు ఈ టీకా వేయాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు.

ఒక్క డోసు.. ఎడమ చేతికి.. భయం అక్కర్లేదు

ఈ వ్యాక్సిన్‌‌ను సింగిల్ డోస్ కింద ఎడమ చేతికి వేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. యూ–విన్ (U-–WIN) పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌‌ లైన్ కుదరకపోతే నేరుగా సెంటర్‌‌ కు వెళ్లి కూడా వేయించుకోవచ్చు. ఈ స్పెషల్ డ్రైవ్ మూడు నెలల పాటు అంటే.. 90 రోజులు కొనసాగుతుంది. 

ఆ తర్వాత రెగ్యులర్ ఇమ్యునైజేషన్‌‌ లో కలుపుతారు.  వ్యాక్సిన్ వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టమైన గైడ్‌‌లైన్స్ ఇచ్చింది. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ తీసుకోవద్దు. టీకా వేసుకున్నాక అరగంట పాటు అబ్జర్వేషన్‌‌లో ఉండాలి. జ్వరం, నొప్పి రావడం కామన్ అని, భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు సూచిస్తున్నారు. 

వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఎవరినీ బలవంతం చేయరు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే బాలికలకు టీకా వేస్తారు. అనారోగ్యంతో ఉన్నా, అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ వేయరు. స్కూళ్లు, అంగన్​వాడీలు, పీహెచ్‌‌సీల ద్వారా అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేయనున్నారు.