- రాష్ట్రంలోని 73.82 లక్షల పట్టాదారులు
- 43,59,371 మంది రైతుల నమోదు
- 110% టార్గెట్ను రీచ్ అయిన రాష్ట్రం
- ప్రోత్సాహకంగా రూ.424 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ వ్యవసాయ విప్లవంలో తెలంగాణ మరోసారి అగ్రగామిగా నిలిచింది. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని 110% అధిగమించి దేశంలో టాప్ స్థానంలో నిలిచింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం పట్టాదారుల సంఖ్య 73.82 లక్షలు ఉండగా, కేంద్రం 39,77,791 మంది రైతుల రిజిస్ట్రీ నమోదును టార్గెట్ విధించింది.
అయితే, తెలంగాణ 43,59,371 మంది రైతులను విజయవంతంగా నమోదు చేసి 110% సాధించింది. ఇది దేశవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీలో అత్యుత్తమ పనితీరుగా నిలిచింది. దేశంలో 3 రాష్ట్రాలు ఈ ఘనత సాధించగా, అందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది.
ఈ విజయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.422.64 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు, క్షేత్ర సిబ్బంది, సాంకేతిక బృందాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి ఈ విజయాన్ని సాధించారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి కృషి, సమన్వయం, అంకితభావాన్ని ప్రశంసించారు.

