- కొత్త రిక్రూట్ మెంట్ లకే నిబంధనలు.. పాత టీచర్లకు వర్తించవు
- మండలం యూనిట్‌గా రిక్రూట్ మెంట్.. బదిలీలూ అక్కడే
- సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదనలు
- జీతాల రేషనలైజేషన్.. ప్రతినెలా 1వ తారీఖు రోజే వేతనాలు ఇవ్వాలని ప్రపోజల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తెలంగాణ విద్యా కమిషన్ కీలక మార్పులను సూచించింది. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి అందించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌లో టీచర్ల నియామకాలు, సర్వీసు నిబంధనలపై పలు ప్రతిపాదనలు చేసింది. ఇకపై టీచర్ల ఉద్యోగం శాశ్వతం కాదని, వారి పనితీరు బాగుంటేనే సర్వీసులో కొనసాగించాలని కమిషన్ స్పష్టం చేసింది.
ప్రతి ఐదేళ్లకోసారి టీచర్ల పెర్ఫార్మెన్స్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీలతో అంచనా వేయించాలని, అందులో ఫెయిలైతే ఉద్యోగం నుంచి తొలగించాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు రాబోయే కొత్త రిక్రూట్‌మెంట్ నుంచే వర్తిస్తాయని, పాత టీచర్లకు ఇబ్బంది ఉండదని వివరించింది.
60 శాతం మార్కులు స్టూడెంట్స్ మార్కులకే
టీచర్ల పనితీరును అంచనా వేసేందుకు కమిషన్ ఒక స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది. ఇందులో 60 శాతం వెయిటేజీ విద్యార్థుల లర్నింగ్ అవుట్‌కమ్స్ కే ఇచ్చింది. ప్రైమరీలో 80 శాతం, హైస్కూల్‌లో 65 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కలిగి ఉండాలని బెంచ్‌మార్క్ పెట్టింది. మిగతా 20 శాతం టీచర్ సామర్థ్యానికి, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తీసుకునే అటెండెన్స్‌కు 10 శాతం, స్టూడెంట్ల అటెండెన్స్, బోధనేతర పని తదితర అంశాలకు 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని సూచించింది.
విద్యార్థుల కనీస సామర్థ్యాలకు సంబంధించి 50 శాతం మార్కులు సాధించలేని టీచర్లకు నోటీసులు ఇవ్వాలని, ఒకవేళ ఐదేళ్ల రివ్యూలో టీచర్ పనితీరు సరిగ్గా లేకపోతే షోకాజ్ నోటీసు ఇచ్చి రెండేళ్ల గడువు విధించాలని, అప్పటికి కూడా ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది.
బదిలీలు బంద్.. ఉండాల్సింది అక్కడే
మండలమే యూనిట్‌గా రిక్రూట్‌మెంట్ జరపాలని, టీచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీలు (హెల్త్ గ్రౌండ్స్‌లో కూడా) ఉండకూడదని కమిషన్ సూచించిది. టీచర్లు తాము పనిచేసే గ్రామంలో లేదా మండల కేంద్రంలోనే (15 కి.మీ పరిధిలో) నివాసం ఉండడం తప్పనిసరని పేర్కొంది. విధుల్లో చేరే ముందే దీనిపై అండర్‌టేకింగ్ తీసుకోవాలని పేర్కొంది. ప్రమోషన్ల విషయంలోనూ ఆటోమేటిక్ పద్ధతికి చెక్ పెట్టింది.
ప్రైమరీ టీచర్లు హైస్కూల్ పోస్టులకు వెళ్లాలంటే మళ్లీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారానే రావాలని, వారికి 10 శాతం వెయిటేజీ మాత్రమే ఉంటుందని పేర్కొంది. మరోపక్క టీచర్ పోస్టుల పేర్లను కూడా మార్చబోతున్నారు. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, సీనియర్ సెకండరీ టీచర్లుగా పిలుస్తారు. హైస్కూల్ టీచర్‌కు పీజీతో పాటు రెండేళ్ల ట్రైనింగ్, ప్రైమరీ టీచర్‌కు డిగ్రీతో పాటు రెండేళ్ల ట్రైనింగ్ తప్పనిసరి అని స్పష్టంచేసింది.
మతపరమైన ఫొటోలు, విగ్రహాలు నిషిద్ధం
ప్రభుత్వ విద్యా సంస్థల్లో దేవుళ్ల పటాలు, విగ్రహాలు, మతపరమైన చిహ్నాలు ఉండకూడదని కమిషన్ సూచించింది. అలాగే గతానికి సంబంధించిన లేదా ప్రస్తుతం జీవించి ఉన్న ఏ ప్రముఖుడి ఫొటో, విగ్రహాలు కూడా ప్రదర్శించరాదని పేర్కొంది. స్కూల్ అసెంబ్లీలు, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం, రాష్ట్ర గీతం మాత్రమే పాడాలని వెల్లడించింది. అటెండెన్స్ రిజిస్టర్లలో లేదా ఇతర బహిరంగ పత్రాల్లో ఎస్సీ, ఎస్టీ కులాల పేర్లను ప్రస్తావించరాదని సూచించింది.
జీతాల రేషనలైజేషన్.. బయోమెట్రిక్‌తోనే సాలరీ
ప్రస్తుతం టీచర్లు, సిబ్బందికి ఇస్తున్న జీతాలు మార్కెట్ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో చేసే నియామకాల్లో జీతాల నిర్మాణాన్ని మార్కెట్ బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా మార్చాలని సూచించింది. తద్వారా విద్యలో నాణ్యత పెంచే ఇతర ఖర్చులకు బడ్జెట్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాగా, ప్రతినెలా 1వ తారీఖునే జీతాలు చెల్లించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే సెలవులు, జీతాల మేనేజ్‌మెంట్ ఉండాలని స్పష్టం చేసింది.
