హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో గజం భూమి రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయింది. ఫేజ్1, 2లోని ధర్మారెడ్డి కాలనీలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ 15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌసింగ్ అధికారులు వేలం నిర్వహించారు. మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. కొన్ని ప్లాట్లను గరిష్టంగా రూ.1.10 కోట్లు, ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ.1.06 కోట్లకు కొనుగోలు చేశారు.
దీంతో ఈ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల ద్వారా రూ.8.45 కోట్లు వచ్చాయన్నారు.
