- ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నరు
- యువతకు ఉద్యోగాలు తెచ్చేందుకే రేవంత్, శ్రీధర్ బాబు అమెరికా పర్యటన
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు ఇంకా ఓటమి బాధలోనే ఉన్నారని, నైరాశ్యంలో వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లారన్నారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో సంపత్ కుమార్ మాట్లాడారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుంటే ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ‘‘కొడంగల్లో సీఎం రివ్యూ మీటింగ్ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ విషయంలో సీఎం తమ్ముడు ఎలా ఉంటాడని విమర్శలు చేస్తున్నారు. సీఎం సొదరుడు కొండల్ రెడ్డి వ్యక్తిగతంగా ఆస్ట్రేలియాకు వెళ్లారు.
అది అధికారిక పర్యటన కాదు. మరో సోదరుడికి అమెరికాలో స్వచ్ బయో కంపెనీ ఉంది. రాష్ట్రంలో ఆయన పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకుంటే ఆయనకు విరుద్ధంగా బాల్క సుమన్, క్రిశాంక్ పనిచేస్తున్నారు. దీని బట్టి కేటీఆర్ కు, వీళ్లకు చెడినట్లుందని అర్థమవుతోంది” అని సంపత్ వ్యాఖ్యానించారు.
పెట్టుబడులపై అనుమానాలొద్దు: జయేశ్ రంజన్
రాష్ట్రంలో విదేశీ కంపెనీల పెట్టుబడులపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులన్నీ నిజమేనని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా పర్యటన ముగిసే నాటికి భారీ పెట్టుబడులతో తిరిగి వస్తామని చెప్పారు. ఆ పెట్టుబడులతో కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధత ఏంటో తెలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులను తీసుకురావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
