V6 News

బీఆర్ఎస్నేతల అరెస్ట్..రఘునాథపల్లి స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నా

బీఆర్ఎస్నేతల అరెస్ట్..రఘునాథపల్లి స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నా

 జనగామ/యాదాద్రి/రఘునాథపల్లి, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను యాదాద్రి, జనగామ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద అరెస్ట్ చేసి వలిగొండ పోలీస్ స్టేషన్​కు తరలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ గేట్ వద్ద మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను పోలీసులు అరెస్ట్​చేసి రఘునాథపల్లి పీఎస్​కు తరలించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రఘునాథపల్లి పీఎస్​ ఎదుట రోడ్డుపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్​ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. 

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్​ది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్​చేయడం దారుణమన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృతుడు శంకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు.