- బీఆర్ఎస్ నేతల విమర్శలు
- ముఖ్యమంత్రి భాషఅంతా బూతులే : శ్రీనివాస్ గౌడ్
- రేవంత్‌ను దింపిన తర్వాతే..కేసీఆర్ పులిలా అసెంబ్లీకివస్తరు: జనార్దన్ రెడ్డి
- సీఎం మాటలు విని పిల్లలు భయపడుతున్నరు: రసమయి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు మూకుమ్మడి మాటల దాడికి దిగారు.బుధవారం కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్, కేటీఆర్తీరుపై సీఎం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు ప్రెస్మీట్లు పెట్టి రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్భాష చూస్తే అసహ్యంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సర్పంచ్ల సన్మాన సభలో బూతులు మాట్లాడి..కొత్త సర్పంచ్‌లకు సీఎం ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని నిలదీశారు. తొండలు, పేగులు అంటూ.. రేవంత్ మొత్తం బూతు శాస్త్రమే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
నాలుగు వేల గ్రామాల్లో సర్పంచులున్న బీఆర్ఎస్ పార్టీ ఎట్ల ఖతమవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ మాట్లాడుతూ.. సర్పంచ్ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన, ఆక్రోశం కొడంగల్ మీటింగ్‌తో బయటపడిందన్నారు. రేవంత్‌ను సీఎం పదవి నుంచి దింపిన తర్వాతే.. కేసీఆర్ పులిలా అసెంబ్లీకి వస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేక కేసీఆర్ పై రేవంత్ బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయో చూపించాలన్నారు. ఆయన నిరూపిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, రేవంత్‌ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేస్తామని అన్నారు.
కేసీఆర్ గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రేవంత్ మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారని, ప్రజలు వెక్కివెక్కి ఏడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఉద్యమ బుల్లెట్ హరీశ్ రావు అని, తెలంగాణ హీరో కేటీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ప్రెస్మీట్పెట్టగానే.. రేవంత్‌రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. హరీశ్ రావు ఆరడుగుల బుల్లెట్ అని, తెలంగాణ బాపు కేసీఆర్అని ఆయన పేర్కొన్నారు.
