- ఎల్బీనగర్లో మరోసారి బయటపడ్డ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు
- మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యే సుధీర్, ఇన్చార్జి రామ్మోహన్ అనుచరుల వీరంగం
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ సెగ్మెంట్లోని అధికార బీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది.ఈ సెగ్మెంట్లోని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ సెగ్మెంట్ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. మంత్రి కేటీఆర్ రాకతో వీరి మధ్య వివాదం మరోసారి బయటపడింది. 15 రోజుల కిందట కేటీఆర్ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తల్లి మృతి చెందారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఇటీవల విదేశీ పర్యటనను ముగించుకుని సిటీకి వచ్చిన కేటీఆర్.. శనివారం వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లోని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ నేపథ్యంలో మంత్రితో పాటు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇన్చార్జి రామ్మోహన్ గౌడ్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరామర్శల అనంతరం కేటీఆర్బయల్దేరగా.. అదే టైమ్‌లో సుధీర్ రెడ్డి అనుచరులు తమ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో రామ్మోహన్ గౌడ్ వర్గీయులు కూడా తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్ మధ్య ఏండ్లుగా విభేదాలున్నట్లు తెలుస్తోంది.

