
టికెట్ కోసం అక్కడే కలవడం మంచిదనే ఆలోచనలో నేతలు
6 న హైదరాబాద్‌కు తిరిగి రానున్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు దుబాయ్ బాట పడుతున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు తన కొడుకును డిగ్రీలో జాయిన్ చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ అమెరికా వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన శనివారం హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఆలస్యమైంది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న హైదరాబాద్‌కు వస్తారు. రిటర్న్ జర్నీలో 12 గంటలు దుబాయ్‌లో బ్రేక్ ఉంది. ఆ టైమ్‌లో గల్ఫ్ దేశాలకు చెందిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు, పలువురు ఇండస్ట్రియలిస్ట్‌లను కేటీఆర్ కలవనున్నారు. అదే సమయంలో ఆయనను కలిసి టికెట్ గురించి తేల్చుకోవాలనే ప్రయత్నాల్లో ఆయన సన్నిహిత నాయకులున్నారు. అందుకు శని, ఆదివారాల్లో దుబాయ్ వెళ్లేందుకు రెడీ అయ్యారు.
ఇక్కడికొచ్చాక కేటీఆర్ టైం ఇవ్వరని...
జనగామ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల్ టికెట్ కోసం బొంతు రామ్మోహన్, పఠాన్ చెరు టికెట్ కోసం నీలం మధు ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇంకో ఐదారుగురు లీడర్లు కూడా దుబాయ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఎక్కువగా టైం ఇవ్వలేరని, తమ గోడు చెప్పుకొని టికెట్ పై హామీ దక్కించుకునేందుకు దుబాయ్‌కి వెళ్లడమే మంచిదనే యోచనలో లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది.