తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మహిళల కోసం సీఎం కేసీఆర్ మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే కళ్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, అమ్మఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేస్తుండగా..రానున్న ఎన్నికల్లో గెలిస్తే మహిళల కోసం సౌభాగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రాగానే పేద మహిళలకు ప్రతీ నెల రూ. 3 వేల జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం బీపీఎల్ కార్డులు ఉన్నవారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చారు.
మరోవైపు మూడోసారి అధికారంలోకి వచ్చాక..వంట గ్యాస్ రేటును కూడా భారీగా తగ్గిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ లబ్దిదారులకు రూ. 400 కే సిలిండర్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు దారులకే కాదు..అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు కూడా వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందచేస్తామని హామీ ఇచ్చారు.
