- వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ నివేదికిచ్చింది.. కమిషన్‌ను రద్దు చేయండి
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదనలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ చట్టవిరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోరారు.
ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ నిరుడు మార్చి 14న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. హరీశ్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణం చేపట్టాలన్నది తమ ముందున్న సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయమన్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యాప్కోస్‌తో దర్యాప్తు చేయించి నివేదిక తెప్పించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కారణంగా రాష్ట్రం వరి నిల్వలకు కేంద్రంగా మారిందన్నారు. 2023లో భారీ వరదల కారణంగా మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందని, దీనిపై కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి ప్రణాళిక, నిర్వహణ, నిర్మాణలోపాలున్నట్లుగా నివేదిక సమర్పించిందన్నారు. అనంతరం కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి దీనిపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఏమీ జరగకుండానే బండి ముందు గుర్రం కట్టినట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఎలా జరిగిందన్నదానిపై నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్.. ఆ పని చేయకుండా వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ నివేదిక సమర్పించిందన్నారు. రాజకీయ కక్షలతో పిటిషనర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కమిషన్ ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, ప్రతిదీ కేబినెట్‌లో చర్చించాకే తీసుకున్నారని తెలిపారు. తనకు తానే న్యాయనిర్ణేత సంస్థగా నిర్ధారించుకుని పిటిషనర్‌తో సహా కొందరిని బాధ్యులుగా చేస్తూ కమిషన్ అభియోగపత్రం లాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు.
పిటిషనర్‌కు కాపీ ఇవ్వకుండా, అసెంబ్లీలో చర్చించకుండానే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించడం ప్రతిష్టను దెబ్బతీయడమేనన్నారు. వ్యక్తిగతంగా బాధ్యులను చేసేముందు సెక్షన్ 8బీ, సీ ప్రకారం నోటీసులు ఇవ్వాలని, వ్యతిరేకంగా చెప్పినవారిని ప్రశ్నించడానికీ అవకాశం ఇవ్వాలన్నారు. వాదనల తర్వాత విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
