- జెన్‌కో కంటే తక్కువ ధర చెప్పినా ఎందుకొద్దంటున్నరు?
- ఇప్పటికే రెండు డిస్కమ్‌లు ఉండగా, ఇంకోటి ఎందుకు?
- విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర
- త్వరలోనే అండర్‌గ్రౌండ్ కేబుల్స్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ పవర్ సహా ఇంటర్‌స్టేట్ స్కామ్స్ బయటపెడ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడేం మాట్లాడినా ఏదో ఒక మిషన్ ఉంటుందని, అదే కమీషన్అని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని స్కామ్‌లకు కేంద్రంగా మార్చింది. రేవంత్‌పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నది. వాటాలు, కమీషన్ల కోసమే కేబినెట్మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. పంపకాల్లో తేడా రావడంతో మంత్రులు బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మొత్తమ్మీద దండుపాళ్యం బ్యాచ్‌లాగా తయారయ్యారు” అని వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. ఇటీవల రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణానికి తెరదీసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రూ.50 వేల కోట్ల విద్యుత్స్కామ్కు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. ‘‘రామగుండలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్‌కోకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఏది తక్కువ ధరకు ప్లాంట్ నిర్మించి, తక్కువ రేటుకు కరెంట్ ఇస్తే.. దానికే అవకాశం ఇస్తామని అంటున్నది. ఇది డ్రామా కాకపోతే ఇంకేంటి? ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.12.23 కోట్ల ఖర్చుతో మొత్తం 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్ చేసుకున్నది. కానీ జెన్‌కో తన డీపీఆర్‌లో మాత్రం ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు ఖర్చవుతుందని స్పష్టంగా పేర్కొంది. మరి ఇందులో ఏది మేలు? రామగుండం దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భూసేకరణ చేసి పరిహారం ఇవ్వాల్సిన పని లేదు. మా హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.7.5 కోట్లకే ఒప్పందం చేసుకున్నం. కానీ ఇప్పుడు ఒక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు ప్రతిపాదించారు. ప్లాంట్ పూర్తయ్యే నాటికి అది రూ.16 కోట్లు అవుతుంది. అంటే 800 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా రూ.7 కోట్ల చొప్పున రూ.5,600 కోట్లు అవుతుంది. ఈ లెక్కన రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల స్కామ్‌కు తెరదీశారు” అని ఆరోపించారు.
ఎన్టీపీసీ కరెంట్ ఎందుకు వద్దు?
2,400 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించాలంటే దాదాపు రూ.50 వేల కోట్లు అవసరమని హరీశ్ రావు తెలిపారు. ఇందులో 80 శాతం అప్పు, 20 శాతం జెన్‌కో నిధులని పేర్కొన్నారు. మరి ప్రభుత్వం రూ.40 వేల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. ‘‘ఎన్టీపీసీ స్టేజ్-1లో భాగంగా నిర్మించిన (2×800 మెగావాట్) ప్లాంట్ నుంచి యూనిట్‌కు రూ.4.88 నుంచి రూ.5.96 వరకు ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నది. స్టేజ్-2లో భాగంగా (3×800 మెగావాట్) సామర్థ్యంతో 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాల్సి ఉంది. ఆ ప్లాంట్ నిర్మించి, రూ.4.12కే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్రానికి ఎన్టీపీసీ చెప్పింది. కానీ ఎన్టీపీసీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ కరెంట్ ఇస్తామంటున్నా ఎందుకు తీసుకోవడం లేదు? థర్మల్పవర్ప్లాంట్లు కట్టబోమని నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. మరిప్పుడు కొత్తగా మూడుప్లాంట్లపై కేబినెట్‌లో చర్చిస్తుంటే ఆయనేం చేస్తున్నరు? ఈ నిర్మాణాలు కమీషన్ల కోసమా.. వాటాల కోసమా?” అని ప్రశ్నించారు. సోలార్ పవర్ ఉత్పత్తి అతీగతీ లేకుండా పోయిందని, సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఏడాదవుతున్నా ఎందుకు అప్పగించలేదని నిలదీశారు.
అప్పుడో మాట.. ఇప్పుడో మాట
సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలాగా ప్రవర్తిస్తున్నారని హరీశ్ విమర్శించారు. ‘‘విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినదానికి.. ఇప్పుడు చేస్తున్నదానికి సంబంధం ఉందా? 2,400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం చారిత్రక ద్రోహమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి అన్నడు. ఇప్పుడదే రేవంత్ తన కమీషన్ల కోసం భారీ ఖర్చుతో కొత్త థర్మల్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమైండు. అధికారంలోకి రాగానే మార్కెట్‌లో యూనిట్కరెంట్రూ.5కే దొరుకుతుందని రేవంత్అన్నడు. ఎన్టీపీసీ నుంచి తీసుకుంటే రూ.8 నుంచి రూ.9 దాకా అవుతుంది కాబట్టి.. అంత ఖర్చు అవసరం లేదని తేల్చేసిండు. మరిప్పుడు రామగుండం ప్లాంట్‌కు రూ.8 ఎందుకు ఖర్చు చేస్తున్నరు. 800 మెగావాట్ల ప్లాంట్ పూర్తి చేయడానికి నాలుగేండ్లయినా పడుతుంది. అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంట్ నిర్మాణ వ్యయం రూ.10,880 కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెరుగుతుంది. యూనిట్కరెంట్ ఖర్చు కూడా రూ.10 పెరుగుతుంది. ఇదంతా ఎవరికి లాభం చేయడానికి, మీ కమీషన్ల కోసమే కదా?” అని అన్నారు.
స్కామ్‌లన్నీ బయటపెడ్తం..
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్త డిస్కమ్ ఎందుకని ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్‌లోనే రేవంత్ యాక్షన్ చేస్తున్నారు. కమీషన్లను దండుకునేందుకే ఇలాంటి స్కామ్‌లకు తెరదీశారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ కరెంట్ సహా ఇంటర్‌స్టేట్ స్కామ్‌నూ త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతాం” అని తెలిపారు.
