ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిన్రు..వాళ్లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: హరీశ్ రావు

ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిన్రు..వాళ్లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, చిరు ఉద్యోగులు, మహిళలు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాల వారు వంచనకు గురయ్యారని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టారని, మహిళలకు బస్సు ఫ్రీగా ఇచ్చినా.. మొగవారికి డబుల్ రేటు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదుసార్లు బస్ చార్జీలు పెంచిందన్నారు. మంగళవారం ఆయన కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ వరకు.. అక్కడి నుంచి తెలంగాణభవన్ కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఆటో డ్రైవర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కు వచ్చి యూసఫ్ గూడాలో ఆటో ఎక్కి ఆటోడ్రైవర్లకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. అయితే వారికిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వాటాల కోసం తన్నుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులకు.. ఆటో కార్మికులకు నెలకు రూ.1000 ఇవ్వడానికి లేవా? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత బూతులు తప్ప ఏం లేవని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. అనంతరం అక్కడే నిర్వహించిన రజక సంఘం కార్యక్రమంలో హరీశ్ పాల్గొన్నారు. కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి, చెప్పనివి అన్నీ చేశారని, కానీ రేవంత్ ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు చెయ్యడం లేదని అన్నారు.