హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలపై కుక్కల దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం ప్రభుత్వం సాధారణమైన విషయంగా భావిస్తున్నదని విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి.
హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాల పాలై, మృతి చెందాడు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరగడాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం’’ అని అన్నారు.
