
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సెక్రటరీకి మరిన్ని ఆధారాలు ఇచ్చాం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరిన్ని ఆధారాలను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశామని, దీనిపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై మరిన్ని ఆధారాలను అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులుకు సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించారు.
సెక్రటరీని కలిసిన వారిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు మరిన్ని ఆధారాలు సమర్పించాలని, వీటిని లీగల్ ఫార్మాట్ లో అందజేయాలని వారం కింద స్పీకర్ కార్యాలయం.. ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లెటర్లు పంపింది.
మూడు రోజుల్లో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని సూచించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల నుంచి కూడా స్పీకర్ కు అఫిడవిట్లు అందిన తర్వాత ప్రత్యక్ష విచారణకు స్పీకర్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. అసెంబ్లీ సెక్రటరీకి అఫిడవిట్లు సమర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అన్ని ఆధారాలను సెక్రటరీకి అందజేశామని, దీనిపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. ప్రజల దృష్టిలో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎలాంటి వారనేది స్పష్టమైందన్నారు.