బీజేపీ కుట్రలను తిప్పి కొడుతా: పైలెట్​ రోహిత్​రెడ్డి

బీజేపీ కుట్రలను తిప్పి కొడుతా: పైలెట్​ రోహిత్​రెడ్డి
  • నందుకుమార్‌‌‌‌ను అడ్డుపెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నరు
  • కేసుతో సంబంధం లేనోళ్లను ప్రశ్నిస్తున్నరు..  నన్ను అరెస్ట్‌‌‌‌ చేసినా బీజేపీకి లొంగను
  • నేను గులాబీ సైనికుడిని.. బీజేపీ కుట్రలను తిప్పి కొడుతా: పైలెట్​రోహిత్​రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందుకుమార్‌‌ను అడ్డుపెట్టుకొని తనను ఇరికించాలని చూస్తున్నారని, ఎట్లాగైనా దోషిగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి ఆరోపించారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, అరెస్ట్‌‌ చేసినా బీజేపీకి లొంగబోనని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీకి తెలంగాణలో తాను బ్రేకులు వేశానని, ఎమ్మెల్యేలను కొనుగోళ్ల కుట్రను బహిర్గతం చేశాననే తనను ఆ పార్టీ టార్గెట్‌‌ చేసిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఫిర్యాదు చేసిన తననే ఈడీ విచారిస్తోందన్నారు. ‘‘మొదటి రోజు ఆరు గంటలు కూర్చోబెట్టి నా బయోడేటా, కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే అడిగారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారిస్తున్నట్టు ఈడీ అధికారులు చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులను విచారిస్తున్నారు. ఇప్పుడు నందుకుమార్‌‌కు నోటీసులు ఇచ్చారు. ఆయనతో నా పేరు చెప్పించాలని ప్లాన్ చేస్తున్నరు” అని అన్నారు. నందుకుమార్‌‌ ద్వారా మొత్తం కేసు తారుమారు చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈడీ నోటీసులను హైకోర్టులో చాలెంజ్‌‌ చేస్తానన్నారు. తద్వారా మరోసారి బీజేపీ కుట్రలు భగ్నం చేస్తానన్నారు.

ఈడీ విచారణ రాష్ట్ర ప్రజల సమస్య

ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీ విచారణ ఒక్క బీఆర్‌‌ఎస్‌‌ సమస్య మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల సమస్య అన్నారు. కేసుతో సంబంధం లేని తన సోదరుడు, అభిషేక్‌‌ సహా ఇతరులను ఎందుకు విచారిస్తున్నారో సమాధానం చెప్పాలని కోరుతూ కోర్టులో రిట్‌‌ పిటిషన్‌‌ వేయబోతున్నానని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో మనీ లాండరింగ్‌‌ జరగలేదన్నారు. తనకు నందుకుమార్‌‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదన్నారు. ఈ కేసులో నందుకుమార్‌‌తో పాటు ప్రమేయమున్న బీజేపీ అగ్రనేతలందరినీ విచారించాలన్నారు. ఈనెల 27న తనను ఈడీ మళ్లీ విచారణకు పిలిచిందని, ఆరోజు విచారణకు హాజరవుతానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ కుట్రలను భగ్నం చేసినందుకే తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తోందన్నారు. తాను గులాబీ సైనికుడినని బీజేపీ కుట్రలను తిప్పి 
కొడుతానన్నారు.