కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే .?

కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే .?

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిని ప్రగతి భవన్ కు పిలిపించుకుని గెలుపుకోసం పనిచేయాలని రాజయ్యకు సూచించారు. భవిష్యత్తులో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఆశచూపారు. ఆ తర్వాత స్టేషన్ ఘన్ పూర్ వెళ్లిన రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాలం కలిసి వస్తే  తాను ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యనేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సిమహాతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజయ్య వ్యా్ఖ్యలు హాట్ టాపిక్ గామారాయి.  ఆయన కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్టేషన్ ఘన్ పూర్ సెగ్మెంట్ లో దాదాపు 85 వేల ఎస్సీ ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 70 వేల వరకు ఉంటాయి. అవన్నీ గంపగుత్తగా తనకేపడుతాయనే భరోసాతో ఉన్న రాజయ్య కాంగ్రెస్ హైకమాండ్ నుంచి బలమైన భరోసా కోసం ఎదురుచూస్తున్నట్లుసమాచారం. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇందిర టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజయ్యకు స్పష్టమైన హామీ వస్తే ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.