కాంగ్రెస్ లోకి చల్లా?.. సీఎం రేవంత్ తో భేటీ!

కాంగ్రెస్ లోకి చల్లా?.. సీఎం రేవంత్ తో భేటీ!
  • అదే బాటలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
  • మారుతున్న ఉమ్మడి పాలమూరు పాలిటిక్స్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కొద్ది సేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చల్లా చేరితో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరుతుంది. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో ముఖ్య నాయకుడిగా పేరున్న చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లోకి చేరేందుకు చూస్తుండడం విశేషం.  అలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం  రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చల్లా వెంకట్రామి రెడ్డి ఇవాళో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలకు తెరలేచింది.

చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.  ఇటీవలే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. విజయుడు కూడా గులాబీ పార్టీని వీడితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు పార్టీ జీరో అవుతుంది.