హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో హడావుడి చేసి డ్రామాలు ఆడారని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రవిచంద్ర మాట్లాడుతూ.."రిజర్వేషన్ల డిమాండ్‌తోనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు.
కాంగ్రెస్ నిర్వహించిన కులగణన పూర్తి అశాస్త్రీయంగా ఉందని, బీసీల సంఖ్యను తక్కువ చూపించారని విమర్శించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాను. దానికి అందరి మద్దతు కోరతాను" అని వెల్లడించారు. సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, దాసోజు, ఎల్. రమణ పాల్గొన్నారు.
