కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే.. రేవంత్​కు వచ్చిన బాధేంటి?

కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే.. రేవంత్​కు వచ్చిన బాధేంటి?
  • రైతులు, ప్రజల కోసమే అక్కడికెళ్లారు
  • రేవంత్ కామెంట్స్​పై బీఆర్ఎస్ ఎంపీల కౌంటర్

న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ లీడర్లు విహార యాత్రలకు వెళ్తారని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే రేవంత్​కు వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. అక్కడి రైతులు, ప్రజల కోసమే కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లారని తెలిపారు. సీఎంను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు చూసి కాంగ్రెస్ భయపడుతున్నదన్నారు. కాంగ్రెస్ తో ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోపించారు. దేశం మొత్తంలో తెలంగాణను భేష్ అంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు అన్నారు. కానీ.. కొందరు అనరాని మాటలు అంటున్నారని ఫైర్ అయ్యారు. కొన్ని గ్రామాల్లో 25 ఏండ్లుగా పడని వర్షాలు పడ్డాయని తెలిపారు. 

కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తున్నదని, వరద నష్టం అంచనా వేస్తున్నదన్నారు. ఎడారిలా ఉన్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఎంపీ నామా అన్నారు. నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లకు రైతులే బుద్ధి చెబుతారని తెలిపారు. రైతులపై రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క హనుమకొండ జిల్లాకు తప్ప అన్ని జిల్లాలకు పరిహారం ఇచ్చామని తెలిపారు. అమెరికా వాళ్ల పైసలు కనబడగానే.. మూడు గంటలు కరెంట్ ఇస్తామంటూ రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఫైర్ అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను షరతుల్లేకుండా నెరవేర్చడం లేదన్నారు. వాళ్లు వచ్చి ఇక్కడ అమలు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.