
- బీఆర్ఎస్ ఎంపీల సవాల్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు కాదు ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు నిరూపించినా తామంతా రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.86 కోట్లు ఇచ్చినట్లు పార్లమెంట్‌ను బీజేపీ ఎంపీ నిశికాంత్ తప్పుదారి పట్టించారు” అని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని పెద్ద ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఒకటని, దీనికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు అన్నారు.
సభను తప్పుదోవ పట్టించినందుకు ఎంపీ నిశికాంత్పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ ప్రకారం రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.88 వేల కోట్లు ఇచ్చామనడం హాస్యాస్పదమని ఎంపీ నామా నాగేశ్వర్ అన్నారు. తామెన్నిసార్లు అడిగినా ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిందని గతంలో కేంద్రమే ఒప్పుకుందని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. అబద్ధాలతో పార్టమెంట్ను బీజేపీ పక్కదారి పట్టిస్తున్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.