బీసీల గురించి బీఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే అర్హత లేదు - మంత్రి సీతక్క

బీసీల గురించి బీఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే అర్హత లేదు - మంత్రి సీతక్క
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు
  • పదేండ్లు అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదు: మంత్రి సీతక్క

కామారెడ్డి, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉందని, తమ ప్రయత్నాన్ని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీతో  కలిసి మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి కేంద్రానికి పంపామని, దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. 

బీసీల గురించి బీఆర్ఎస్​ వాళ్లకు మాట్లాడే అర్హత లేదని, పదేండ్లు అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్​ వాళ్లకు నచ్చడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకపోగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి పక్కనబెడుతూ వచ్చిందని, గ్రూప్–1 విషయంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. 

సోషల్​ మీడియాను, వాళ్ల పేపర్లు, టీవీలను అడ్డం పెట్టుకొని అబద్ధాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వాళ్లు పదేండ్లలో 80 వేలు కూడా ఇవ్వలేదన్నారు. గతంలో బీఆర్ఎస్​లో చేరిన వాళ్ల గురించి కేటీఆర్​ మాట్లాడాలని హితవు పలికారు. వాళ్ల పార్టీలోకొస్తే గొప్ప డీఎన్ఏనా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు  కలిశారని పేర్కొన్నారు. 

2014,2018  ఎన్నికల తరువాత కాంగ్రెస్​, టీడీపీ, సీపీఐ, బీఎస్పీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను, వందలాది మంది ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని 
గుర్తు చేశారు.