AI వల్ల పెరుగుతున్న కుర్ర బిలియనీర్లు.. 20 ఏళ్ల లువానా సక్సెస్ స్టోరీ మీకోసం..

 AI వల్ల పెరుగుతున్న కుర్ర బిలియనీర్లు.. 20 ఏళ్ల లువానా సక్సెస్ స్టోరీ మీకోసం..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొందరికి ఇది ఉద్యోగ గండంగా కనిపిస్తుంటే, మరికొందరికి మాత్రం అపర కుబేరులుగా మార్చే 'రాకెట్ షిప్'లా కనిపిస్తోంది. 2025లో మునుపెన్నడూ లేని విధంగా  రికార్డు స్థాయిలో 30 ఏళ్ల లోపు యంగ్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ ప్రపంచ వ్యాప్తంగా అవతరించారు. అయితే దీనికి ఏఐ ఒక ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది.

2025లో 30 ఏళ్ల ప్రాయంలో ఉన్న 13 మంది యువ పారిశ్రామికవేత్తలు బిలియనీర్ల క్లబ్ లో చేరారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. విశేషమేమిటంటే వీరిలో 11 మంది కేవలం కొన్ని నెలల్లోనే ఈ మైలురాయిని దాటారు. ఏళ్ల తరబడి కష్టపడితే వచ్చే విజయం.. నేడు ఏఐ పుణ్యమా అని కొన్ని నెలల్లోనే వరిస్తోంది. ఇన్వెస్టర్లు ఏఐ స్టార్టప్‌లపై కురిపిస్తున్న కాసుల వర్షమే కుర్ర బిలియనీర్ల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. 

ఒకప్పుడు బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే వేల మంది ఉద్యోగులు, ఫ్యాక్టరీలు, లాజిస్టిక్స్ అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఏఐతో ఒక చిన్న టీమ్ సరైన కోడింగ్, ఐడియాతోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నారు. డిజిటల్ యూజర్లపై ఏఐని కేవలం ఒక పరికరంగా కాకుండా.. ఒక పునాదిగా వాడుకుంటూ దశాబ్దాల వృద్ధిని కేవలం కొన్ని ఏళ్లలోనే సాధిస్తున్నారు నేటి తరం యువత.

కొత్తతరం బిలియనీర్లలో 20 ఏళ్ల బ్రెజిల్ యువతి లువానా లోప్స్ లారా ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. టెక్నాలజీ ప్రపంచంలోకి రాకముందు ఆమె ఐరోపాలో ప్రొఫెషనల్ డ్యాన్సర్. కళాకారిణిగా క్రమశిక్షణ, ఇంజనీరింగ్‌కు కావాల్సిన ఆలోచన ఆమెను విజేతగా నిలబెట్టాయి. MITలో చదువుతున్నప్పుడు తారెక్ మన్సూర్ తో కలిసి 'కల్షి' అనే ప్రిడిక్షన్ మార్కెట్ స్టార్టప్‌ను స్థాపించింది. ఇటీవల ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో.. లువానా రాత్రికి రాత్రే ప్రపంచంలో చిన్న వయస్సులోనే సెల్ఫ్ మేడ్ మహిళా  బిలియనీర్‌గా మారిపోయారు. 

దీనిని చూస్తుంటే.. రానున్న రోజుల్లో 20 ఏళ్ల లోపు వారు కూడా యంగ్ సెల్ఫ్ మేడ్  బిలియనీర్ల లిస్టులో చేరడం పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు. ఏఐ సాంకేతికత సంపద సృష్టిలో పాత రూల్స్‌ను పూర్తిగా చెరిపివేసి, సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని లువానా జర్నీ చెప్పకనే చెబుతోంది.