Salesforce Layoffs: సేల్స్‌ఫోర్స్ భారీ లేఆఫ్స్: AI విభాగంలోనూ కోతలు.. అసలు ఏం జరుగుతోంది..?

Salesforce Layoffs: సేల్స్‌ఫోర్స్ భారీ లేఆఫ్స్: AI విభాగంలోనూ కోతలు.. అసలు ఏం జరుగుతోంది..?

గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం సేల్స్‌ఫోర్స్(Salesforce) తన ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. 2026 ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే కంపెనీ సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాలతో పాటు.. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఏజెంట్ ఫోర్స్' AI విభాగంపై కూడా ఈ లేఆఫ్స్ ప్రభావం పడటం గమనార్హం. గత డిసెంబర్ నుంచి కంపెనీలో ఐదుగురు అగ్రశ్రేణి నాయకులు వైదొలగగా.. వారి స్థానంలో ఆరుగురు కొత్త ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తూ కంపెనీ నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఈ తొలగింపుల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కంపెనీ సీఈఓ మార్క్ బెనియోఫ్ గతంలో ఎంతో గొప్పగా చెప్పుకున్న 'ఏజెంట్ ఫోర్స్' విభాగానికి చెందిన వారు కూడా ఉండటం. ఏజెంట్ ఫోర్స్ అనేది సేల్స్‌ఫోర్స్‌లో ఒక భాగం కాదు.. అది ప్రతి ప్రొడక్ట్ గుండెకాయ అని బెనియోఫ్ గతంలో వ్యాఖ్యానించారు. కంపెనీ రూపొందించే ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు AI పునాది అని ఆయన నొక్కి చెప్పారు. స్వయంప్రతిపత్తి కలిగిన బాట్లను ఉపయోగించి పనులను వేగవంతం చేయడమే ఈ ఏజెంట్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు అదే విభాగంలో లేఆఫ్స్ కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కంపెనీ వ్యూహాత్మకంగా మారుతున్న తీరుకు ఈ లేఆఫ్స్ నిదర్శనం. గత ఏడాది ఆగస్టులో మార్క్ బెనియోఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. AI వినియోగం వల్ల కస్టమర్ సపోర్ట్ టీమ్ సంఖ్యను భారీగా తగ్గించగలిగామని తెలిపారు. గతంలో 9వేల మంది ఉన్న సపోర్ట్ స్టాఫ్ సంఖ్య.. AI టూల్స్ వాడకం వల్ల 5వేలకు తగ్గిందని ఆయన వెల్లడించారు. అంటే మనుషుల స్థానంలో AI ఏజెంట్లను ప్రవేశపెట్టడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని, సామర్థ్యాన్ని పెంచుకోవడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఉద్యోగ కోతలకు గురైన వారు లింక్డ్‌ఇన్ వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. సుమారు 10వేసకు పైగా ఏజెంట్ ఫోర్స్ డిప్లాయ్‌మెంట్లతో కంపెనీ తర్వాతి స్థాయికి వెళ్తోందని బెనియోఫ్ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో లేఆఫ్స్ మాత్రం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తం మీద సేల్స్‌ఫోర్స్ ప్రస్తుతం AI-ఫస్ట్ వ్యూహంతో ముందుకు వెళ్తూ.. మానవ వనరుల కంటే సాంకేతికతకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సుస్పష్టంగా కనిపిస్తోంది.