గత మేనిఫెస్టోల అమలు ఏపాటి?

గత మేనిఫెస్టోల అమలు ఏపాటి?

2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భారత రాష్ట్ర సమితి  2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టింది. ఆయా ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటి అమలు తీరును పరిశీలిద్దాం. గత 10 ఏండ్లలో ఆయా పథకాలకు బడ్జెట్​లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయ లేదు. రాష్ట్ర బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సిన సబ్ ప్లాన్ నిధుల్లో  సగం కూడా ఖర్చు చేయలేదు. సమాజంలో సగ భాగం కంటే ఎక్కువ ఉన్న బీసీ జనాభా సమగ్ర అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు అతి తక్కువ. ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు తప్ప, ఇంతకాలం మహిళల సమగ్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలేమీ లేవు. సమగ్ర భూ సర్వే, యువతకు నిరుద్యోగ భృతిలాంటి హామీలు అసలే అమలు చేయలేదు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య హామీ అటకెక్కింది. మొత్తం ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అనే హామీ కూడా అమలుకు నోచుకోలేదు. 

గత 10 ఏండ్లుగా ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి నమూనా వల్ల రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర జీఎస్​డీపీ లో అప్పులు 38 శాతానికి చేరుకున్నట్లు కాగ్ నివేదించింది. ఇది రుణాల విషయంలో గరిష్ట పరిమితిని దాటడమే. అంటే రాష్ట్రం మరింత జీఎస్​డీపీ పెరిగే వరకూ కొత్త అప్పులు కూడా పుట్టవు. ఇప్పటికే ట్రాన్స్ కో, డిస్కం, మిషన్ భగీరథ, పౌర సరఫరాల శాఖ లాంటి కార్పొరేషన్​లు ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు అందకపోవడం వల్ల అప్పులలో ఉన్నాయి. రైతులకు ఋణమాఫీ పూర్తిగా అమలుకాలేదు. రైతులకు పంట రుణాలపై వడ్డీ రాయితీ అందడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు పేరుకుపోయాయి. కాంట్రాక్టర్లకు ఇప్పటికే చేసిన పనులకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్​లు కూడా ప్రతి నెలా ఒకటవ తేదీన చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం నుంచి రాష్ట్రం చేసిన అప్పులపై అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరంలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పు చెల్లింపు, నిర్వహణ ఖర్చు, విద్యుత్ వినియోగ ఖర్చు కనీసం ఏడాదికి రూ.25,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు అమ్ముకుని బడ్జెట్ లోటును పూడ్చుకోవాల్సిన స్థితికి ఇప్పటికే రాష్ట్రం చేరింది.

బెస్ట్​ అగ్రికల్చర్​ పాలసీ అమలైతే.. 

7000 మంది రైతులెందుకు ఆత్మహత్య చేసుకున్నారు? 36 శాతం మంది కౌలురైతులకు ఎందుకు గుర్తింపు లభించలేదు? రెండుసార్లూ ఋణమాఫీ ఎందుకు సరిగా అమలుకాలేదు? పంటల బీమా పథకం ఎందుకు పూర్తిగా ఆగిపోయింది? పంటల ప్రణాళికను సంవత్సరానికి ఒకసారి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వరి, పత్తి తప్ప రాష్ట్రంలో మిగిలిన పంటలు ఎందుకు ఎగిరిపోయాయి? రైతుల సంఖ్య పెరుగుతున్నా, పంట ఋణాలు బ్యాంకుల నుంచి పొందే రైతుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది? వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాలు ఎందుకు జీవం కోల్పోయాయి?  రైతుల రుణ విముక్తి కమిషన్ ఎందుకు మూలనపడింది? వరి పంట సేకరిస్తున్నా, రైతులకు ఎందుకు పూర్తి స్థాయి మద్దతు ధర లభించలేదు?   మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాక, ధాన్యం ఎందుకు వానకు తడుపుకోవాల్సి వస్తున్నది? వీటికి జవాబు ఇవ్వాలి కదా?

బెస్ట్ దళిత్ పాలసీ అమలైతే.. దళితులను ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేదు? దళిత కుటుంబాలన్నిటికీ మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్​లో సగం నిధులు మాత్రమే ఎందుకు ఖర్చు అయ్యాయి? దళితులపై ఆధిపత్య కులాల దాడులు ఎందుకు పెరిగాయి? దళిత బంధు పథకానికి నిధులు ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు? ఈ పథకం ఎందుకు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది? 

బెస్ట్ వెల్ఫేర్ పాలసీ అమలైతే.. ఎందుకు ఇంకా లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు మద్యం అమ్మకాలు పెంచుతూ, మహిళలను వితంతువులుగా మారుస్తున్నారు? కుటుంబాల్లో ఎందుకు హింస పెంచుతున్నారు? కుటుంబంలో ఎందుకు ఒక్కరికే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు? 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే అందులో సగం మందికి కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? గత 10 ఏండ్లుగా ఒక్కసారి కూడా రాష్ట్రంలో కనీస వేతనాలను ఎందుకు పెంచలేదు? 

బెస్ట్ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించుకుంటే..స్కూళ్లలో విద్యా ప్రమాణాలు దేశంలోనే అట్టడుగుకు ఎందుకు పడిపోయాయి? విద్యా రంగానికి బడ్జెట్ ఎందుకు తగ్గిపోయింది? యూనివర్సిటీలు ఎందుకు నిస్సారంగా మారిపోయాయి? ఎందుకు ఆయా విద్యా సంస్థలలో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయడం లేదు? జవాబు చెప్పాలి కదా?
బెస్ట్ హెల్త్ పాలసీ అమలు చేస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ఎందుకు సౌకర్యాలు మెరుగుపడలేదు?  ఆరోగ్యశ్రీ  బకాయిలు కోట్లాదిగా ఎందుకు ఉన్నాయి?  అన్ని జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందుకు నిర్మాణం కాలేదు? ప్రజలకు ఉచిత వైద్యం ఎందుకు అమలులోకి రాలేదు? ఇప్పటికీ కుటుంబాలు ప్రైవేట్ వైద్యంపై ఎందుకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తున్నది? జవాబు చెప్పాలి కదా?

బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అమలైతే.. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ రంగ, సహకార రంగ పరిశ్రమా ఎందుకు మొదలుకాలేదు? రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిశ్రమలలో స్థానికులకు ఎందుకు ఉపాధి దొరకడం లేదు?  నిజాం షుగర్స్ కంపెనీ ఎందుకు ప్రారంభించలేదు? ప్రజలు వ్యతిరేకిస్తున్నా, కాలుష్య కారక ఫార్మాసిటీని ఎందుకు నిర్మిస్తున్నారు? జవాబు చెప్పాలి కదా ?

బెస్ట్ హౌసింగ్ పాలసీ అమలైతే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లక్ష కూడా నిర్మించలేకపోయారు? ఇప్పటికీ ఎందుకు అన్ని ఇండ్లను అర్హులైన పేదలకు అందించలేకపోయారు? గృహలక్ష్మి స్కీమ్ ఎందుకు కొత్తగా ప్రారంభించవలసి వచ్చింది? ఎందుకు ఎక్కువమందిని అనర్హులుగా చేయడానికి నిబంధనలు పెట్టారు? చెప్పాలి కదా?

మరింత మోసపోవాలా? 

ఇంత ఘోరంగా అన్ని పాలసీలను అమలు చేస్తూ, వాటిని యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించడమంటే, అవే తప్పులను పునరావృతం చేయడమని అర్థం. రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి దించడమని అర్థం. రైతుల ఆత్మహత్యలను మరింత పెంచడమని అర్థం. దళితులను, మహిళలను, బీసీలను, ఆదివాసీలను, ముస్లిం ప్రజలను మరింత మోసం చేయడమని అర్థం. విద్యారంగాన్ని మరింత పాతాళంలోకి తీసుకు వెళ్లడమని అర్థం. ఈ అభివృద్ధి నమూనాతో. ఈ తప్పుడు విధానాలతో, ప్రజలు మరింతగా మోసపోవాలా? జవాబు చెప్పాలి కదా?...

బెస్ట్​ పాలసీల్లో నిజమెంత?

గత పదేండ్లుగా 11 అద్భుతమైన విధానాలను రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి  కొత్త మేనిఫెస్టోలో పేర్కొన్నది. బెస్ట్ ఆర్థిక పాలసీ రూపొందించుకుంటే రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో, స్థూల ఆర్థిక విలువలో 38 శాతానికి అప్పులు ఎందుకు చేరాయో కూడా మేనిఫెస్టోలో చెప్పాలి కదా? అందరికీ అప్పులు కట్టకుండా, ఎందుకు బకాయిలు పెట్టారో కూడా చెప్పాలి కదా?  ప్రజలపై సేవల ఫీజుల భారం ఎందుకు పడిందో, విద్యుత్, రవాణా ఛార్జీలు, ధరణి ఫీజులు ఎందుకు పెరిగాయో చెప్పాలి కదా?

బెస్ట్ పవర్ పాలసీ అమలు చేస్తే.. డిస్కంలు ఎందుకు రూ.50,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయాయో చెప్పాలి కదా? వ్యవసాయానికి రోజుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నా, వ్యవసాయానికి అవసరమైన కరెంట్ కేవలం10 గంటలే ఎందుకు సరఫరా చేస్తున్నారో వివరణ ఇవ్వాలి కదా? పంపిణీ సంస్థల ఆస్తులన్నీ ఎందుకు తాకట్టు పెట్టారో కూడా చెప్పాలి కదా?

బెస్ట్  డ్రింకింగ్ వాటర్ పాలసీ అమలు చేస్తే, మిషన్ భగీరథ ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయల అప్పులో ఎందుకు ఉంది? ఇప్పటికీ చాలా గ్రామాలకు, తండాలకు, పట్టణాల్లో బస్తీలకు రోజు విడిచి రోజు మాత్రమే ఎందుకు మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారో చెప్పాలి కదా? రాష్ట్రంలో మంచి నీళ్ల ప్రైవేట్ వ్యాపారం ఎందుకు పెరిగింది? భగీరథ నీళ్లను ఇతర అవసరాలకు వాడుతున్నారు తప్ప ఎందుకు తాగడం లేదో చెప్పాలి కదా?

 బెస్ట్ ఇరిగేషన్ పాలసీ అమలైతే.. కొత్తగా వివిధ సాగు నీటి ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు ఎంత పెరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలి కదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు? ఎంత విద్యుత్ బిల్లులు కట్టారు? ప్రాజెక్టు తప్పుడు డిజైన్ వల్ల, ఎన్ని ఎకరాలు ముంచారు? 21 గ్రామాలను ఖాళీ చేయించి, మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించి, ఎన్ని టీఎంసీల నీళ్లు నింపారు? 10 ఏండ్లయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? ఇలాంటి విషయాలపై కూడా శ్వేతపత్రం ప్రకటించాలి కదా?

- కన్నెగంటి రవి,కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్డినేటర్,తెలంగాణ పీపుల్స్​ జేఏసీ