కారు సర్వీసింగ్‌‌కే పోయింది..షెడ్డుకు పోలే : కేటీఆర్

కారు సర్వీసింగ్‌‌కే పోయింది..షెడ్డుకు పోలే :  కేటీఆర్
  •     పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలే.. ఇందుకు నాదే బాధ్యత: 
  •     బీఆర్ఎస్‌‌కు ఓటమి కొత్త కాదు.. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
  •     పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారనడం సరికాదు
  •     యాదాద్రి అక్షింతలను నల్గొండ జిల్లాలో పంచితే గెలిచేవాళ్లమేమో
  •     బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు:  కారు షెడ్డుకు పోలేదని, పదేండ్ల పాటు విరామం ఎరుగకుండా పని చేసిందని, ఇంకా స్పీడ్​పెంచేందుకు సర్వీసింగ్‌కే పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌కు ఓటమి కొత్త కాదని, ఇది స్పీడ్​బ్రేకర్​మాత్రమేనన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన భువనగిరి లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పుచేశారని కొందరు మాట్లాడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. అలా ప్రజలను తప్పుబట్టడం సరికాదు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్‌కు ప్రజలు అండగా నిలిచారు. రెండుసార్లు మన పార్టీని గెలిపించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్​ను పూర్తిగా తిరస్కరించలేదు. కొందరు కాంగ్రెస్​కు ఓటేసిన వాళ్లు కూడా కేసీఆర్​ఎందుకు సీఎం కాలేదని అడుగుతున్నారు” అని చెప్పారు. పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న జిల్లాల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయన్నారు.

9 కారణాలను గుర్తించినం

బీఆర్ఎస్ ఓడిపోవడానికి 9 కారణాలను లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలో గుర్తించామని కేటీఆర్ అన్నారు. ‘‘పరిపాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు. పార్టీ సంస్థగత నిర్మాణం సరిగా జరగలేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారితో పాటు కొత్తగా వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. ఇందుకు పూర్తిగా నాదే బాధ్యత’’ అని చెప్పారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సెంట్రిక్‌గా​పార్టీని నడపడం సరికాదని, పదేండ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని కూడా పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఓటరుకు చేర్చడానికి కార్యకర్తలు లేకపోవడం కూడా పొరపాటేనని నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ‘‘కొత్తగా 6 లక్షలకు పైగా రేషన్​కార్డులిచ్చినా, ప్రతి నియోజకవర్గంలో కొత్తగా 15 వేల మందికి పింఛన్​ఇచ్చినా జనంలోకి తీసుకుపోలేకపోయాం. వంద మందిలో ఒకరికి రాకుంటే.. దానికే ఎక్కువ ప్రచారం దొరికింది. తక్కువ రైతుబంధు తీసుకున్న వాళ్లు.. ఎక్కువ భూమి ఉన్నవాళ్లకు ఎక్కువ మొత్తం ఇవ్వడాన్ని ఒప్పుకోలేదు. దళితబంధు కొందరికే ఇవ్వడంతో మిగతా వారు దూరమయ్యారు. ఈ స్కీం ఇతర కులాల్లోనూ వ్యతిరేకతకు కారణమైంది. వీటితో పాటు మరికొన్ని కారణాలను కార్యకర్తలు చెప్పారు. అమలు చేసిన సంక్షేమ పథకాలతో భవిష్యత్​లో తలెత్తబోయే ప్రజావ్యతిరేక ప్రభావాన్ని సరిగా అంచనా వేయలేకపోవడంతోనే ఓడిపోయాం. కార్యకర్తలు చెప్తున్న అంశాలతో కూడిన నివేదికను ప్రతి రోజు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​కు అందజేస్తున్నం’’ అని వివరించారు.

కాంగ్రెస్ నాలుక మడతేసింది

‘‘కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిద్దామని అనుకున్నాం. కానీ గవర్నర్​ప్రసంగంతో ప్రభుత్వమే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అందుకే దానికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్లు ప్రభుత్వంలో కుదురుకునే ప్రయత్నం మానేసి ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారు. అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్వేతపత్రాల పేరుతో చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు” అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్​తయారు చేసిన జగదీశ్​రెడ్డి, తమ లాంటి కార్యకర్తలే అసెంబ్లీలో ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టామని, రేపు కేసీఆర్​అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేరని అన్నారు. నిరుద్యోగ భృతి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీల విషయంలో కాంగ్రెస్​ఇప్పటికే నాలుక మడతేసిందని ఎద్దేవా చేశారు. డిసెంబర్​9న అమలు చేస్తామని చెప్పిన రుణమాఫీ, పింఛన్ల పెంపు, వరికి బోనస్​హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన మిగతా హామీలన్నీ ఇప్పుడే అమలు చేయాలని తాము కోరడం లేదని స్పష్టం చేశారు. 

బీజేపీకి బీఆర్ఎస్ ఎన్నటికీ బీ టీమ్​ కాదు

బీజేపీకి బీఆర్ఎస్ ఎన్నటికీ బీ టీమ్​కాదని, ఆ పార్టీతో పొత్తు ఉండదని కేటీఆర్ తేల్చిచెప్పారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించింది బీఆర్ఎస్సేనని అన్నారు. ‘‘కేసీఆర్ తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. మనం బీజేపీకి బీ టీమ్ అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేవారా? కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేసి బీఆర్ఎస్​ను దెబ్బతీశాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే వారు శంకరాచార్యులకు, పీర్ల పండగకు ముడి పెడుతున్నట్టు లెక్క” అని అన్నారు. అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవడంతోనే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఉప ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని చెప్పారు. ‘‘బీజేపీ తమ రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నది. యాదాద్రి అక్షింతలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచితే గెలిచేవాళ్లమేమో” అని అన్నారు. ఇకపై ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, పార్టీ చుట్టూనే ఎమ్మెల్యేలు తిరిగే పద్ధతి తీసుకువస్తామని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ఒక కాకికి ఆపద వస్తే మిగతా కాకులు ఒక్క చోట చేరినట్టే.. ఒక్క బీఆర్ఎస్​కార్యకర్తకు ఆపద వస్తే మిగతా కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు.