
- అందరినీ లోపలకు వెళ్లనివ్వాలని రాస్తారోకో
- బస్‌భవన్ వద్ద ఉద్రిక్తత
- చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి వినతి
సిటీ నెట్వర్క్, వెలుగు: పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని గురువారం బీఆర్‌ఎస్ ‘చలో బస్సు’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, పద్మారావు, ఎమ్మెల్యేలు వివిధ బస్సుల్లో ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన నిర్వహించి ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బస్భవన్వద్ద రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించిన పలువురు బీఆర్ఎస్లీడర్లను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉదయమే బస్సుల్లో బస్‌భవన్‌కు..
ఉదయమే వెస్ట్‌మారేడ్‌పల్లిలోని మాజీ మంత్రి తలసాని ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తలసాని, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి రేతిఫైల్బస్టాండ్ కు చేరుకొని 2వ నంబర్ బస్సు ఎక్కారు. బస్సుల్లో ప్రయాణికులతో పెరిగిన చార్జీల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్భవన్వద్ద దిగాక పోలీసులు ముందుకు పోనియ్యకపోవడంతో వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినట్టు చెప్పారు. అప్పటికే హరీశ్‌రావు కూడా మెహదీపట్నం నుంచి బస్సులో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చేరుకున్నారు. మరోవైపు బస్సులో బస్భవన్ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవిలను అంబర్‌పేట ఇరానీ హోటల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారు రోడ్డుపైనే నిరసనకు దిగడంతో పోలీసులు లాలాగూడ పీఎస్ కు తరలించారు. తాము ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పడంతో వదిలేశారు. దీంతో వారంతా బస్‌భవన్‌కు రాగా, అందరూ కలిసి బస్‌భవన్‌కు వెళ్తుండగా వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, లీడర్లు ఉండడంతో పోలీసులు బస్భవన్వద్ద అడ్డుకున్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రి తలసాని, పద్మారావు, ఎమ్మెల్య్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవీ, దేశపతి శ్రీనివాస్ లను మాత్రమే బస్‌భవన్‌లోకి అనుమతించారు. తమను కూడా వెళ్లనివ్వాలని మిగతా వారు పోలీసులతో వాదనకు దిగారు.
నినాదాలు చేస్తూ బస్‌భవన్ ముందు రాస్తారోకో చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో పోలీసులు వారిని అరెస్ట్‌చేసి తరలించారు. లోపలకు వెళ్లిన బీఆర్ఎస్లీడర్లు చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని వినతిపత్రం ఇచ్చి వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతున్నరు
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్‌ను నడపడం లేదని సర్కస్నడుపుతోందని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసి దాని ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి పురుషుల మీద మాత్రం చార్జీల మోత మోగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్హయాంలో ఆర్టీసీకి నెలకు రూ.120 కోట్లు, ఏడాదికి 1500 కోట్ల గ్రాంట్లు ఇచ్చామన్నారు. కార్గో ద్వారా ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చేదని, కాంగ్రెస్ వచ్చాక నెలకు రూ.మూడు కోట్లు, ఏడాదికి రూ.36 కోట్లు మాత్రమే వస్తోందన్నారు.
నష్టాలు వస్తే ప్రభుత్వం భరించాలని, ప్రజా రవాణా నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ ఎంజీబీఎస్ ను తాకట్టు పెట్టడం, ఉప్పల్ డిపోను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తాను మెహిదీపట్నం నుంచి బస్సులో వచ్చానని, గతంలో అక్కడి నుంచి బస్ భవన్ వరకు రూ.30 ఉండేదని, ఇప్పుడు అది రూ.40 అయ్యిందన్నారు. హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి, ప్రైవేట్ పరం చేస్తే సిటీలోని ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తారన్నారు.