
- తర్వాతి స్థానాల్లో టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైసీపీ
- ఏడీఆర్ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ పార్టీకి ఆ ఏడాది మొత్తం రూ.685.51 కోట్ల ఆదాయం లభించింది. అదే ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా 40 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, అందులో బీఆర్ఎస్ పార్టీనే రూ.685 కోట్ల (27%) ఆదాయం ప్రకటించినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధవారం తన రిపోర్టులో వెల్లడించింది.
ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఈ రిపోర్టును ఏడీఆర్ తయారు చేసింది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో రూ.2,117.85 కోట్లు (83.64 శాతం) స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చినట్టు రిపోర్టులో పేర్కొంది.
ఇందులో రూ.1,796.024 కోట్లు (70 శాతానికి పైగా) ఎన్నికల బాండ్ల రూపంలో సమకూరినట్టు తెలిపింది. ఆదాయం పరంగా బీఆర్ఎస్ తర్వాత టీఎంసీ (646.39 కోట్లు), బీజేడీ (297.81 కోట్లు) , టీడీపీ (285.07 కోట్లు), వైసీపీ (191.04 కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఈ ఐదు పార్టీల ఆదాయమే రూ.2,105.82 కోట్లు అని, మొత్తం ప్రాంతీయ పార్టీల ఆదాయంలో వీటిదే 83.17 శాతం వాటా అని వివరించింది.
కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంతో ఈ 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.1,736.851 కోట్లుగా ఉందని, 2023–24లో ఇన్‌కమ్ రూ.794.951 కోట్లు పెరిగిందని పేర్కొంది. అత్యధికంగా టీఎంసీ ఆదాయం రూ.312.93 కోట్లు, టీడీపీది రూ.221.07 కోట్లు, బీజేడీ ఆదాయం రూ.116.753 కోట్లు పెరిగినట్టు చెప్పింది. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో గోవా ఫార్వార్డ్ పార్టీ మాత్రం జీరో ఆదాయాన్ని చూపినట్టు ఏడీఆర్ తన రిపోర్టులో వెల్లడించింది.
బీఆర్ఎస్ ఖర్చు 254 కోట్లు..
40 ప్రాంతీయ పార్టీల ఖర్చులు రూ.1,320 .96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్ రూ.254.914 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. వైసీపీ, డీఎంకే, ఎస్పీ, జేడీయూ సహా 12 పార్టీలు ఆదాయానికి మించి ఖర్చు చేసినట్టు చెప్పింది. జీరో ఆదాయం ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ రూ.1.56 లక్షల ఖర్చు చూపిందని పేర్కొంది.