జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి
  • ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​ను​ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు
  • నియోజకవర్గంలో మంత్రులు వివేక్,​ సీతక్క, పొన్నం ప్రచారం

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​తో కలిసి టోలిచౌకిలోని జానకినగర్, గుల్షన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. షేక్​పేట డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ముస్లిం సోదరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకొని, వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమాజ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు.

పనులు చేసి ఓట్లు అడుగుతున్నం: పొన్నం ప్రభాకర్యూసుఫ్ గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఫ్రీ బస్సు, సున్నా వడ్డీ రుణాలు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజలకు మంచి పనులు చేసిన తర్వాత మాత్రమే తాము ఓట్లు అడుగుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ, సానుభూతితో ఓట్లు అడుగుతోందని ఆయన ఆరోపించారు. 

చిన్న శ్రీశైలం కుటుంబంపై ఆ వ్యాఖ్యలు సరికావు: సీతక్క బోరబండలో మంత్రి సీతక్క ప్రచారం చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ సహాయ సహకారాలు తీసుకున్న కేసీఆర్.. ఆనాడు ఆయనను పొగిడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డైరెక్ట్​గా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. తమ కుటుంబాన్ని తిట్టినా.. వాటిని అక్షింతలు గానే స్వీకరించి ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధమవుతామన్నారు.