బీఆర్ఎస్​ ఎల్పీ నేతగా కేసీఆర్.! 

బీఆర్ఎస్​ ఎల్పీ నేతగా కేసీఆర్.! 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​లో ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ పక్షనేతగా కేటీఆర్, హరీశ్​రావులలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులను కాదనుకుంటే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. శాసనసభ పక్షనేతగా తానే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఆయన ఆదేశాలతోనే శనివారం ఉదయం బీఆర్ఎస్​ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కాలి తుంటి ఎముక విరిగి యశోదా హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న కేసీఆర్ హిప్ రీ ప్లేస్​మెంట్​సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్​కు వెళ్లడానికి ముందు కేటీఆర్, హరీశ్​రావుకు ఎల్పీ సమావేశం నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్​ఎల్పీ పక్షనేతగా కేసీఆర్​ ఎన్నికైనా ఆయన ఇప్పట్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. శనివారం రాత్రి ఆయనకు హిప్​రీ ప్లేస్​మెంట్​సర్జరీ చేశారు. కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టొచ్చని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్​సెషన్​లోనే ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. బీఆర్ఎస్​ఎల్పీ డిప్యూటీ లీడర్లుగా కేటీఆర్, హరీశ్​రావుకు అవకాశం ఇవ్వొచ్చని సమాచారం.