- మంత్రి సీతక్క రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‍లోకి రావాలే
- ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
వరంగల్, వెలుగు : వరంగల్ హంటర్ రోడ్డులోని గ్రీన్‌హుడ్ స్కూల్ ఏరియాలో ఈ నెల 6న బీఆర్‌ఎస్ రైతు సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధ్యక్షతన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‍లో గురువారం జరిగిన మీడియా సమావేశానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. ఆ పార్టీ నేత రాహుల్‍గాంధీ స్వయంగా హాజరై రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు కమిషన్ వంటి ఆరు హామీలు ఇచ్చారని.. తీరా చూస్తే రెండున్నరేండ్ల కాంగ్రెస ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పంట సాయానికి రైతు భరోసా, సన్నబియ్యానికి బోనస్ ఉత్తి ముచ్చటేనన్నారు.
రైతులు మక్కలు, ధాన్యం విక్రయానికి వస్తే కొనుగోలు సెంటర్ల వద్ద ఇబ్బందులు తప్పట్లేదన్నారు. గన్నీ సంచులు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదన్నారు. మంత్రి సీతక్క రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోకి రావాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన మే6న అదే వరంగల్‌లో రైతుల పక్షాన సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, రాబోయే రెండేండ్లలో ఇదే వరంగల్‌లో లక్ష మందితో కేసీఆర్‍తో కలిసి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ నిర్వహించుకునేందుకు స్థలం దొరకకుండా అధికార పార్టీ నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. సభ నిర్వహణకు స్థలం ఇస్తామని మాటిచ్చిన హనుమకొండ కలెక్టర్ తర్వాత సైలెంట్ అయ్యారని మండిపడ్డారు.

