టిమ్స్, నిమ్స్ లోన్లకు బ్రేక్.. పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడమే కారణం

టిమ్స్, నిమ్స్ లోన్లకు బ్రేక్.. పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడమే కారణం

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ దవాఖాన్ల నిర్మాణాల కోసం అప్పులు చేసిన గత బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్, ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే అప్పులకు వడ్డీలు కట్టడం ఆపేసింది. దీంతో శాంక్షన్ అయిన లోన్ లో మిగతా మొత్తం విడుదలను బ్యాంకర్లు ఆపేసినట్టు తెలిసింది. ఆరోగ్యశాఖ ద్వారా అప్పులు తీసుకునే అవకాశం లేకపోవడంతో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట కొత్తగా ఓ కార్పొరేషన్‌‌ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఈ కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డబ్బుతో వరంగల్‌‌ హెల్త్ సిటీ, హైదరాబాద్‌‌లో4 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించింది. అప్పుల కోసం ఎస్‌‌బీఐ సహా వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. తొలుత వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌‌నగర్‌‌‌‌, అల్వాల్‌‌, కొత్తపేట టిమ్స్‌‌ల కోసం రూ.4 వేల కోట్ల అప్పు కోసం దరఖాస్తు చేసింది. ఎస్‌‌బీఐ కన్సార్టియం మధ్యవర్తిత్వంతో వివిధ బ్యాంకులు రూ.3,535 కోట్ల అప్పులు దశలవారీగా ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. 

ఈ అప్పులకు సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నకొద్దీ వడ్డీ చెల్లిస్తూ ఉండాలి. అసలు మాత్రం మూడు ఏండ్ల తర్వాత నుంచి వడ్డీతో కలిపి ఇన్‌‌స్టాల్‌‌మెంట్ల రూపంలో చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొత్తం రూ.3,535 కోట్ల నుంచి రూ.816 కోట్లు విడుదలవగా, వాటి వడ్డీ చెల్లింపును ఆగస్ట్ నుంచి నిలిపివేశారు. కొత్త సర్కార్ వచ్చి ఈ లెక్కలన్నీ చూడడానికి 2 నెలల టైం పట్టింది. దీంతో మొత్తంగా 6 నెలల వడ్డీ పెండింగ్‌‌లో పడింది. మంజూరైన లోన్ లో మిగతా మొత్తాలను విడుదల చేయాలంటే  వడ్డీలను చెల్లించాలని బ్యాంకర్లు కొత్త సర్కార్‌‌‌‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.  

పేషెంట్ల నుంచి వసూలు చేస్తామని.. 

తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట అప్పుల కోసం ఓ కొత్త కార్పొరేషన్‌‌ను గత సర్కార్ ఏర్పాటు చేసింది. కొత్తగా కట్టే హాస్పిటల్స్‌‌లో పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తామని బ్యాంకర్లకు తెలిపింది. ఒక్కో హాస్పిటల్‌‌లో 200 పేయింగ్ రూమ్‌‌లను ఏర్పాటు చేస్తున్నట్టు బిల్డింగ్ డిజైన్లను కూడా సమర్పించింది. 

తద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ప్రభుత్వం నుంచి కార్పొరేషన్‌‌కు నిధులు (గ్యారంటీ) ఇస్తామని రాసిచ్చి అప్పులు రాబట్టుకుంది. నిమ్స్ నుంచి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా, కేవలం నిమ్స్ ఆదాయాన్నే ఎక్కువగా చూపించడం ద్వారా అప్పులు రాబట్టుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ, వడ్డీ కింద జమ చేయాల్సిన రూ.70 కోట్లు కూడా జమ చేయలేకపోవడంతో, ఆ అప్పు కూడా ఆగిపోవడం గమనార్హం. 

రూ. 70 కోట్లు కట్టలేక.. ఆగిన నిమ్స్ లోన్  

కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు కాకుండా, నిమ్స్‌‌ హాస్పిటల్ పేరిట కూడా అప్పులు తీసుకోవడానికి గత సర్కార్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా రూ.2 వేల కోట్ల అప్పుల కోసం ప్రయత్నించగా రూ.1,750 కోట్ల అప్పులు ఇచ్చేందుకు ఓ బ్యాంకుతో ఒప్పందం కుదిరింది. ఈ డబ్బులతో నిమ్స్‌‌లో 2 వేల పడకల కెపాసిటీతో కొత్త బిల్డింగ్‌‌ను కట్టాలని నిర్ణయించారు. ఈ బిల్డింగ్‌‌కు గతేడాది జూన్‌‌లోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. అప్పులు ఇచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకు ఆరు నెలల వడ్డీ, సుమారు రూ.70 కోట్లు ముందే కట్టాలని కండీషన్ పెట్టింది. 

కానీ, ప్రభుత్వం నుంచి నిమ్స్‌‌కు డబ్బులు ఇవ్వకపోడం, నిమ్స్ వద్ద వడ్డీలు కట్టేంత సంపాదన లేకపోవడంతో ఆ రూ.70 కోట్లు చెల్లించలేకపోయారు. దీంతో శాంక్షన్ అయిన రూ.1,750 కోట్లలో ఒక్క రూపాయిని కూడా బ్యాంకర్లు నిమ్స్‌‌కు విడుదల చేయలేదు. కానీ, ఎన్నికల ముంగట లబ్ధి పొందేందుకు నిధులు లేకుండానే కొత్త బిల్డింగ్‌‌కు శంకుస్థాపనలు చేయడంతో పాటు, బిల్డింగ్‌‌ డిజైన్లను గత సర్కార్ మీడియాకు విడుదల చేసింది. నిమ్స్‌‌కు కొత్త బిల్డింగ్ వచ్చిందంటూ బీఆర్‌‌‌‌ఎస్ సోషల్ మీడియా హడావుడి చేసింది.