ఫ్రీ సింబల్స్ కేటాయింపుపై పిటిషన్‌ వెనక్కి తీసుకున్న బీఆర్‌‌ఎస్‌

ఫ్రీ సింబల్స్ కేటాయింపుపై పిటిషన్‌ వెనక్కి తీసుకున్న బీఆర్‌‌ఎస్‌
  • ఫ్రీ సింబల్స్ కేటాయింపుపై పిటిషన్‌ వెనక్కి తీసుకున్న బీఆర్‌‌ఎస్‌

న్యూఢిల్లీ, వెలుగు : కారును పోలిన గుర్తులను ఏ పార్టీ అభ్యర్థికీ కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఉపసంహరించుకుంది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, కెమెరా, చపాతి రోలర్‌, సోప్‌ డిష్‌, టెలివిజన్‌, కుట్టు మిషన్‌, ఓడ, ఆటో రిక్షా, ట్రక్‌ వంటి గుర్తులను ఫ్రీ సింబల్స్‌ లిస్ట్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కారును పోలిన గుర్తులతో బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని ఆ పార్టీ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ సింగిల్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని, అందుకు పర్మిషన్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు అడ్వకేట్ మీనాక్షి అరోడా కోరడంతో, కోర్టు అంగీకరించింది. దీంతో ఆ పిటిషన్‌ను బీఆర్ఎస్ వెనక్కి తీసుకుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో ఈ ఫ్రీ సింబల్స్ ఎవరికి కేటాయించకుండా, ఈ అంశానికి సంబంధించి వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేలా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే హైకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకుందని తెలిసింది. ఇదే అంశంపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.