కాంగ్రెస్​లో టికెట్లు అమ్ముకుంటున్నరు : కేటీఆర్​

కాంగ్రెస్​లో టికెట్లు అమ్ముకుంటున్నరు : కేటీఆర్​
  • డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నరు
  • కర్నాటక కమీషన్ల దందాపై నేను చెప్పిందే నిజమైంది
  • బాబు భద్రతపై లోకేశ్​ ట్వీట్ బాధ కలిగించింది: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​లో కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటు న్నారని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి​కేటీఆర్​ ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికే టికె ట్లు ఇస్తున్నారని తెలిపారు. కూకట్​పల్లి టికెట్​ కోసం రూ.15 కోట్లు ఇచ్చి, ఇంకో రూ.10 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని ఆఫర్​ చేశారని తనతో ఒక లీడర్​ చెప్పా రన్నారు. శుక్రవారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో ఆయన మీడియాతో చిట్​చాట్​ చేశారు. ‘40 స్థానాల్లో అభ్యర్థులే లేని కాంగ్రెస్​ పార్టీ 70 స్థానాల్లో ఎలా గెలుస్తుంది? జీహెచ్ ఎంసీ పరిధిలోనే 25 స్థానాల్లో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు.

ఇది నిజం కాదా? ’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ​గెలుస్తుందని చెప్పిన సర్వేనే 2018లోనూ చెప్పిందన్నారు. బీజేపీ మూడు స్థానాల్లో మాత్రమే పోటీలో కనిపిస్తుందని, 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్​గల్లంతు కావడం ఖాయమన్నారు. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ​మేనిఫెస్టో ఉంటుందని ​కేటీఆర్​అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు.. ఇప్పటి వరకు ఏమేం చేశామో ఆదివారం కేసీఆర్​ ప్రకటిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారని, ఇప్పటికే నియోజకవర్గాలను ఒక రౌండ్​ చుట్టేశారని తెలిపారు. కానీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థెలవరో తేలడం లేదన్నారు.  

ఇక్కడ ఓట్లు కొనేందుకు కర్నాటకలో కమీషన్లు

తెలంగాణలో ఓట్లు కొనేందుకు కర్నాటకలో కాంట్రాక్టర్ల​ నుంచి అక్కడి కాంగ్రెస్​ ప్రభుత్వం కమీషన్​లు వసూలు చేస్తున్నదని తాను గతంలోనే చెప్పానని, ఈ రోజు అది నిజమైందని కేటీఆర్​ అన్నారు. మాజీ కార్పొరేటర్​ భర్త అయిన కాంట్రాక్టర్​ఇంట్లో రూ.42 కోట్లు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుందని, ఆయన ఇప్పటికే రూ.8 కోట్లు కొడంగల్​కు తరలించిన ట్టుగా సమాచారం ఉందన్నారు.

కాంగ్రెస్​55 ఏండ్లలో ఏం చేసిందని ఓట్లు అడుగుతుందో చెప్పాలన్నారు. దక్షిణాది నుంచి హ్యాట్రిక్​ కొట్టబోయే మొదటి సీఎం కేసీఆర్​ అన్నారు. తమ పార్టీని గెలిపిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. కాంగ్రెస్, బీజేపీల్లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్​ను సీఎం చేస్తారనే దానిపై మీడియా ప్రశ్నించగా కేటీఆర్​స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ పోటీ నుంచి తప్పుకొని తనను యునానిమస్​గా సీఎం చేయాలన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిపై కొంత మేరకు వ్యతిరేకత ఉండొచ్చని, కానీ రాష్ట్రానికి సీఎం ఎవరవుతారనే ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.  

పని తీరు మార్చుకోని ఒకరిద్దరికి బీఫాంలు ఇవ్వబోమని సీఎం కేసీఆర్​ అభ్యర్థులను ప్రకటించే టైంలోనే చెప్పారని, అలా ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉండొచ్చని తెలిపారు. మైనంపల్లి హన్మంతరావు పార్టీ వీడటంపై స్పందిస్తూ రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు.

అన్ని సూచికల్లో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రం

అన్ని సూచికల్లో తెలంగాణ ప్రగతిశీల, అగ్రశ్రేణి రా ష్ట్రంగా ఉందని కేటీఆర్​ చెప్పారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రమైన తెలంగాణ కన్నా ముందు ఉందో చెప్పాలన్నా రు. రైతు సంక్షేమంలో టాప్​లో ఉన్నామని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​సాక్షిగా చెప్తే కేంద్ర హోం మంత్రి అమిత్​షా రైతు ఆత్మహత్యలు ఎక్కువ అని మాట్లాడానికి సిగ్గుండాలన్నారు.  మోదీ ఇక్కడి కి వచ్చి మోస్ట్​ కరప్ట్​ గవర్నమెంట్అని విమర్శలు చేస్తారని, ఆయన ఒక్కడే పవిత్ర ఆత్మ అన్నట్టు, మిగతా వాళ్లంతా అవినీతి పరులని ప్రధాని స్థాయి వ్యక్తి ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. 

పొన్నాల వస్తానంటే నేనే వెళ్లి ఆహ్వానిస్తా.. 

పొన్నాల లక్ష్మయ్య తమతో కలిసి పనిచేస్తానంటే తానే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాని కేటీఆర్​ అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్​లో తన్నుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్​లో సీఎం పదవిపై ముగ్గురు లీడర్ల మధ్య ఒప్పందం జరిగినట్టుగా తనకు సమాచారం ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఓవర్​లోడ్​అయ్యిందని, ఎమ్మెల్యే సెంట్రిక్​గా ఉండటంతో ఎమ్మెల్యే కావడమే ముఖ్యమనే భావనలో తమ పార్టీ లీడర్లు ఉన్నారని అన్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని, అలాంటి వారిని ఏమి చేయలేమన్నారు.

బీఆర్ఎస్​లీడర్లపైనే కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని, కాంగ్రెస్​ నేతలు కనిపించడం లేదా అన్నారు. రేవంత్​అక్రమాలు, ఆక్రమణల గురించి కేంద్ర ఏజెన్సీలకు సమాచారం లేదా.. ఓటుకు నోటు కేసును ఓపెన్​చేయండి ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 2018లో వచ్చినట్టే 88 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు.  ఈటల రాజేందర్​గజ్వేల్​నుంచే కాదు ఇంకో 50 నియోజకవర్గాల నుంచి, షర్మిల 119 స్థానాల నుంచి పోటీ చేసుకోవచ్చన్నారు. 

వంద నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం

సీఎం కేసీఆర్​ వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని కేటీఆర్​ తెలిపారు. తాను జీహెచ్ఎంసీతో పాటు సిరిసిల్ల, కామారెడ్డిలో ప్రచారం చేస్తానని.. నియోజకవర్గాల నుంచి వచ్చే డిమాండ్​ను బట్టి తాను మంత్రి హరీశ్​రావు వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్క నిరుద్యోగ భృతి తప్ప మిగతా హామీలన్నీ నెరవేర్చామన్నారు. తాను సిరిసిల్లలో మద్యం, డబ్బు పంచకుండా ఓట్లు అడుగుతానని, మిగతా వాళ్లు తనలాగే ఉండాలని కోరుకోవడం సరికాదన్నారు. క్యాస్ట్, కమ్యూనిటీ ఆధారంగా ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్నారు. మతం చూడకుండా మనిషిని మనిషిగా చూసి పాలన అందిస్తున్నామని తెలిపారు. తాము జాతీయ స్థాయిలో సొంతంగా ఎదగాలని అనుకుంటున్నామని, అలాంటప్పుడు తాము ఇంకొకరికి బీ టీమ్​గా ఎందుకు పని చేస్తామో చెప్పాలన్నారు.

లోకేశ్​ బాధ అర్థం చేసుకోగలను

చంద్రబాబు భద్రతపై లోకేశ్​చేసిన ట్వీట్ చూసి బాధ అనిపించిదని కేటీఆర్​ పేర్కొన్నారు. ఒక కొడుకుగా ఈ బాధను అర్థం చేసుకోగలనన్నారు. లోకేశ్​చెప్పింది నిజం అయితే ఆ పరిస్థితి బాధాకరమన్నారు. అక్కడి పరిస్థితులపై తనకు నిజానిజాలు తెలియవన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తూ నిమ్స్​లో ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్​చీఫ్​ తన దగ్గరికి వచ్చి నిరాహార దీక్షను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్​బ్రెయిన్​డెడ్ ​అవుతారని చెప్పారని తనకు అది ఎంతో బాధ కలిగించిందన్నారు. ఏపీ రాజకీయాలకు హైదరాబాద్​ వేదిక కావొద్దని మాత్రమే తాను ఇక్కడ ఆందోళన చేయొద్దని, రెండు పార్టీల మధ్య రాజకీయాల్లోకి తెలంగాణను లాగొద్దని మాత్రమే  గతంలో చెప్పానన్నారు.