గొప్పగా పని చేసినా ప్రజలు తిరస్కరించిన్రు : కేటీఆర్

గొప్పగా పని చేసినా ప్రజలు తిరస్కరించిన్రు : కేటీఆర్
  • పనులు చేసుకుంటూ పోయినం.. ప్రచారం చేసుకోలె: కేటీఆర్
  • ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచేవాళ్లమని కామెంట్

హైదరాబాద్, వెలుగు:  పనులు చేసుకుంటూ పోయామే తప్ప ప్రచారం చేసుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచేవారిమని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు. గొప్పగా పని చేసినా కాంగ్రెస్​తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు బీఆర్ఎస్​ను తిరస్కరించారని అన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్​సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోలేదు కాబట్టే నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారని, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారని కామెంట్ చేశారు. రైతులు రూ.2 లక్షల లోన్​లు తీసుకుంటే అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని రేవంత్​రెడ్డి చెప్పారని, డిసెంబర్​9వ తేదీ నుంచే పలు హామీలను అమలు చేస్తామని చెప్పి.. వాటిని నెరవేర్చే దారిలేక అప్పులు, శ్వేతపత్రాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పేందుకే తాము స్వేదపత్రం రూపొందించామని చెప్పారు. 

పొరపాట్లు సమీక్షించుకుని ముందుకు పోదం.. 

కేసీఆర్​ప్రభుత్వం వందలాది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా.. ఏ రోజు కూడా ప్రజలను అప్లికేషన్ల పేరుతో లైన్లలో నిలబెట్టలేదని కేటీఆర్ అన్నారు. ప్రతి పనిలో ప్రజల సౌకర్యం చూశామే తప్ప రాజకీయ ప్రచారం గురించి ఏ రోజూ ఆలోచించలేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్​ను తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్​కు మూడో వంతు సీట్లు ఇచ్చారని, 39 స్థానాల్లో గెలిచామని, ఇంకో 14 సీట్లలో 6 వేల లోపు ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్​కు బలమైన నాయకత్వం ఉందని, అన్నింటికి మించి కేసీఆర్​లాంటి గొప్ప నాయకుడు మనకు ఉన్నారని తెలిపారు. ఓటమితో ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై ఇలాంటి సమావేశాలు వరుసగా పెట్టుకుందామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుందామని అన్నారు. అన్నివర్గాలు పార్టీకి దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎస్టీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్, పోడు పట్టాల పంపిణీ, రిజర్వేషన్ల పెంపు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి కోసం ప్రవేశపెట్టినా అనేక నియోజకవర్గాల్లో ఎస్టీలు మనకు పూర్తిగా మద్దతివ్వలేదన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయో సమీక్షించుకొని ముందుకు సాగుదామన్నారు. మహబూబాబాద్​పార్లమెంట్​స్థానాన్ని గెలిపించుకునేందుకు అందరూ ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన తొలగించాలె

బీఆర్ఎస్,​ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, దానిని తొలగించాలని పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్‌‌‌‌‌‌‌‌సభ సన్నద్ధత సమావేశంలో పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు పార్టీ ఓటమిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓటమిపై రివ్యూలతో కాలం గడపొద్దన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నిరుద్యోగులను సంతృప్తి పరచలేకపోయామని, వాస్తవాలు ఏమిటో చెప్పలేకపోయామని పేర్కొన్నారు. ఇకనైనా పార్టీ నాయకత్వం క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోవాలని, తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు.

ఎన్ని చేసినా చెప్పుకోలే.. 

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్​ప్రభుత్వంలో  6,47,479 రేషన్​కార్డులు ఇచ్చినా రేషన్​కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేశారని, దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ తాము ఏనాడూ చెప్పుకోలేదని కేటీఆర్ అన్నారు. ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్​అని, తెలంగాణ ఏర్పాటుకు ముందు 29 లక్షల మందికి పింఛన్​లు ఇస్తే.. తమ ప్రభుత్వంలో 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని గుర్తుచేశారు. వాటి గురించి కూడా ఏ రోజు తాము ప్రచారం చేసుకోలేదని అన్నారు.