
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్ కలిసి కుట్ర చేస్తున్నరు: మాజీ మంత్రి కేటీఆర్
- బీఆర్‌ఎస్‌ను అణగదొక్కుతున్నరు
- కొన్నిచోట్ల బీజేపీ గెలిచేలా కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టింది
- దేశంలో అన్ని దరిద్రాలకూ బీజేపీనే కారణమని విమర్శ
హైదరాబాద్/మేడిపల్లి, వెలుగు: ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి కేసీఆర్‌ను బొందపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్‌ఎస్ పార్టీని అణగదొక్కుతున్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెరి కొన్ని సీట్లు గెలిచేలా ఆ రెండు జాతీయ పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఎలాగోలా తామే గెలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్ గెలవొద్దని వారు పంతం పట్టారని, ఇందుకోసం కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టాయని అన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నాయని తెలిపారు. మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ను, సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డిని గెలిపించేందుకు.. కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టిందని ఆరోపించారు.
కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థినే ప్రకటించకపోవడానికి కారణమేంటో ప్రజలు ఆలోచించాలన్నారు. ‘‘ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధాన మంత్రి తాపి మేస్త్రి.. ఇద్దరూ కలిసి కేసీఆర్‌ను బొంద పెట్టాలని చూస్తున్నరు. ఏదైనా చేసి మనం ఇద్దరమే ఉండాలె తప్ప.. కేసీఆర్ ఉండొద్దు.. బీఆర్‌ఎస్ ఉండొద్దు అని కోరుకుంటున్నారు. వీన్ని గుంజుడు, వాన్ని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు.. అన్నీ ఈ కుట్రలో భాగమే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ పదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదు
దేశంలో అన్ని దరిద్రాలకూ బీజేపీనే కారణం అని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి గురించి అడిగితే అయోధ్య రాముడి గురించి చెప్పుడు తప్పితే, ఆ పార్టీ పదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తాము కూడా అద్భుతమైన యాదాద్రి గుడి కట్టినం తప్పితే.. ఇంటింటికీ దేవుడి పఠాలు, అక్షింతలు పంపించి చిల్లర రాజకీయం చేయలేదని అన్నారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదు అని, పిరమైన ప్రధాని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ. 1200 అయిందని, రూ.60 ఉన్న డీజిల్ ధర రూ.100కు, రూ.70 ఉన్న పెట్రోల్ ధరను రూ.110కు బీజేపీ పెంచిందని మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే, పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు పెంచారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో నిత్యవసరాల ధరలు పెరగడానికి పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా ఉండటమే కారణమని తెలిపారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత కల్లోలాలు సహా అన్ని దరిద్రాలకు బీజేపీ కారణం అని, ఆ పార్టీని అందరం కలిసి పాతరేయాలని పిలుపునిచ్చారు. రాముడు అందరి వాడు అని, బీజేపీ మనిషి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర
దేశంలో ప్రజలు ఎనుకున్న 8 రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రధాని మోదీ కూల్చేశారని కేటీఆర్ అన్నారు. అయితే తన జేబులో ఉండాలె.. లేదంటే జైల్లో ఉండాలె అన్నట్టు సీఎంలను కూడా మోదీ వదిలిపెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మోదీ కూలగొడ్తడేమోనని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
ఈ భయం వల్లే లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నాడని ఆరోపించారు. ఇప్పుడు కూడా మోదీ కోసమే రేవంత్ పనిచేస్తున్నాడని అన్నారు. తామైతే రేవంత్‌రెడ్డి సర్కారు ఐదేండ్ల పాటు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. సంపదను పెంచే, పంచే తెలివి రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకూ రేవంత్‌రెడ్డి వెంటపడ్తామని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగంపై చర్చ జరగాలి
దేశంలో నిరుద్యోగంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేరొందిన విద్యా సంస్థల్లో చదువుకున్న యువతకు కూడా ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదనే అంశంపై కూడా చర్చించాలని బుధవారం ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు. దేశంలో నిరుద్యోగానికి ఇది నిదర్శనం కాదా? ఐఐటీ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నరు. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్న ఈ కీలక సమయంలో నిరుద్యోగంపై చర్చ జరగాలి.
ప్రపంచంలోనే యువ రక్తం అధికంగా ఉన్న దేశం మనది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమే”అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ముంబై ఐఐటీలో 30 శాతం మంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ పొందలేకపోయారని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. హైదరాబాద్ అంటేనే వరల్డ్ క్లాస్ సిటీ అని మరో ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరైనా సరే ఒప్పకోక తప్పని నిజం తెలిపారు.