మేం ఆత్మగౌరవ ఇండ్లు కట్టినం..మీరు అగ్గిపెట్టె ఇండ్లు కడ్తున్నరు: కేటీఆర్

మేం ఆత్మగౌరవ ఇండ్లు కట్టినం..మీరు అగ్గిపెట్టె ఇండ్లు కడ్తున్నరు: కేటీఆర్
  • వీకెండ్​లో పేదల ఇండ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్నరు
  • రెండున్నరేండ్లలో హైదరాబాద్​లో కట్టిన ఇండ్లెన్నో చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఆత్మగౌరవ ఇండ్లు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. తాము రూ.70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదని, తాము కట్టిన ఒక్కో ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డబ్బా ఇండ్లు కాకుండా డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు నిర్మించామన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని చాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా అని ప్రశ్నించారు.

సవాల్​కు మంత్రి కట్టుబడి ఉండాలని సవాల్​ విసిరారు. సవాళ్లు చేయడం, పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనన్నారు. ‘చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో 60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిండ్లను నిర్మించి చూపించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్​లో డబుల్ బెడ్రూమ్​ గృహాలను కట్టండి. వీకెండ్​లో మంది ఇండ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్న మీకు గృహ నిర్మాణాలపై మాట్లాడడానికి సిగ్గుండాలి. పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు కాంగ్రెస్​ వాళ్లు. రెండున్నరేండ్లలో సిటీలో కట్టిన ఇండ్లెన్ని? కూల్చిన ఇండ్లెన్ని? శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కేటీఆర్​ డిమాండ్​ చేశారు.