హైదరాబాద్, వెలుగు: మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడ్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కనీసం ఒక్క పని కూడా చేయకుండానే, 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేసిందని దుయ్యబట్టారు. ‘‘మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడమే కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పా? ’’ అని బుధవారం ఒక ప్రకటనలో కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్ పై అప్పులు, అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అపోహలు, అర్థ సత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్ లో నిలుస్తున్నది. ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి 4- లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై పడుతుంది”అని పేర్కొన్నారు. ‘‘ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా రూ. 50 వేల కోట్లు అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి? 2023 నాటికి రాష్ట్రం రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే, 8 నెలల కాలంలో దాన్ని రూ.50 వేల కోట్ల అప్పుగా మార్చేశారు” అని దుయ్యబట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ధి చెప్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సంక్షోభంలో పంచాయతీలు
రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల పాలన పూర్తిగా పడకేసిందని విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారని, ప్రజాపాలన అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనా? అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయన్నారు. ‘‘మా హయాంలో ప్రతి నెలా పంచాయతీలకు డబ్బులు విడుదల చేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.
పైగా ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను కూడా దారి మళ్లించింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో హైదరాబాద్ లో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడ్డాయి. ఈ నెల 15లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళన చేయడానికి మున్సిపల్ కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోవద్దు” అని కేటీఆర్ అన్నారు.
