ములుగు జిల్లాలో హై అలర్ట్‌‌.. మావోయిస్టుల ఏరివేతకు మీటింగ్​

ములుగు జిల్లాలో హై అలర్ట్‌‌.. మావోయిస్టుల ఏరివేతకు మీటింగ్​
  • రంగంలోకి బీఎస్‌‌ఎఫ్‌, సీఆర్‌‌పీఎఫ్‌‌‌ ఉన్నతాధికారులు
  • పాల్గొన్న రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌రెడ్డి

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగుతెలంగాణ ‒ చత్తీస్‌గఢ్‌‌ బోర్డర్‌‌లో అధిక సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌‌ అయ్యింది. మావోయిస్టులను ఏరివేయడానికి బీఎస్‌‌ఎఫ్‌ను రంగంలోకి దించింది. సీఆర్‌‌పీఎఫ్‌‌తోపాటు బీఎస్ఎఫ్‌‌ బలగాలు సైతం అడవులను జల్లెడ పట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా బీఎస్‌‌ఎఫ్‌, సీఆర్‌‌పీఎఫ్‌‌‌కు చెందిన ఉన్నతాధికారులు రెండు ప్రత్యేక హెలీకాప్టర్లలో వచ్చారు. ఆదివారం ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీస్‌‌ స్టేషన్‌‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి, స్మగ్లర్‌‌ వీరప్పన్‌‌ను ఎన్‌‌కౌంటర్‌‌ చేసిన సీఆర్‌‌పీఎఫ్‌ ఉన్నతాధికారి విజయ్‌‌ కుమార్‌‌, ‌తెలంగాణ, చత్తీస్‌‌ గఢ్‌‌ రాష్ట్రాల సీఆర్పీఎఫ్‌ డీజీపీలు, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌‌ ఐజీ స్టీఫెన్‌‌ రవీంద్ర, బస్తర్‌‌ రేంజ్‌‌ ఐజీ సుందర్‌‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సమావేశం జరిగింది. మీటింగ్‌‌లో ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత అంశంపైనే చర్చ జరిగినట్లుగా రాష్ట్ర పోలీస్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ములుగు జిల్లాలో హై అలర్ట్‌‌

రెండు నెలల వ్యవధిలోనే డీజీపీ మహేందర్‌రెడ్డి వెంకటాపురం ఏజెన్సీలో పర్యటించడం ఇది రెండోసారి.  తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌రెడ్డితో పాటు చత్తీస్‌‌ గఢ్‌‌ రాష్ట్ర పోలీస్‌‌ ఉన్నతాధికారులతో సమావేశం కావడానికి బీఎస్‌‌ఎఫ్‌‌, సీఆర్‌‌పీఎఫ్‌‌ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అంతటా పోలీసులు హై అలర్ట్‌‌ ప్రకటించారు. తెలంగాణ‒ చత్తీస్‌‌ గఢ్‌‌ రాష్ట్రాల సరిహద్దులోని వెంకటాపురం పోలీస్‌‌ స్టేషన్‌‌లో సమీక్ష నిర్వహిస్తుండటంతో చుట్టూ 40 కి.మీ. దూరం పోలీస్‌‌ బలగాలను మోహరించారు. వెంకటాపురం మండల కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం నుంచే పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొన్నిచోట్ల వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు.

బలం పెంచుకుంటున్న మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను మావోయిస్టులు తమ సేఫ్‌‌ జోన్​గా మలుచుకున్నారు. ములుగు, భద్రాచలం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌ తదితర జిల్లాల్లోని దట్టమైన అడవిలో నివసించే గిరిజనులను తమకు అనుకూలంగా  మార్చుకుని కరపత్రాలను పంపిణీ చేయటం, పలు విధ్వంసక, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. ఏజెన్సీ కేంద్రంగా తమ బలాన్ని పెంచుకుంటున్నారు. ఏజెన్సీ సరిహద్దుల్లో అనునిత్యం డేగ కన్నుతో కాపలా కాస్తూ, అడవిలో కూంబింగ్ చేసే పోలీసు పార్టీలకు కరోనా సోకడంతో కొద్ది రోజులు కూంబింగ్‌‌లు ఆగిపోయాయి. దీంతో మావోయిస్టులు అడవిలో ఒక పల్లె నుంచి మరో పల్లెకు స్వేచ్ఛగా తిరగడం, యువతను వారికి అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దుల్లో నుంచి భారీ సంఖ్యలో మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు సైతం ధ్రువీకరించాయి.

ఎందుకీ సమీక్ష?

చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అడవుల్లో డ్రోన్​కెమెరాతో తీసిన వాగు దాటుతున్న మావోయిస్టుల వీడియో ఒకటి ఇటీవల బయటపడింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తీసిన వీడియో కావడంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌‌ అయ్యాయి. భద్రాచలం, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లో ఇటీవల మావోయిస్టుల ఎన్‌‌కౌంటర్లు జరిగాయి. ఇదీకాక మావోయిస్టులు వందల సంఖ్యలో కొత్త రిక్రూట్‌‌మెంట్‌‌ చేసుకున్న విషయం బయటపడింది. దీంతో మన రాష్ట్ర పోలీస్‌‌ విభాగం సైతం అప్రమత్తమైంది. వారం రోజులుగా బీఎస్‌‌ఎఫ్‌‌కు చెందిన హెలీకాప్టర్‌‌ అడవిలో తిప్పి సమాచారం సేకరించారు. సెంట్రల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ హెచ్చరికలతో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర పోలీస్‌‌ విభాగాలకు సహకరించడానికి బీఎస్‌‌ఎఫ్‌‌, సీఆర్‌‌పీఎఫ్‌‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.