
- కొన్ని ప్రాంతాల్లోఒక్క ఉద్యోగి కూడా లేని పరిస్థితి
- కస్టమర్ , ఔట్ డోర్ సర్వీసులకు ఇబ్బందులు
- ఉన్నోళ్ల పైనే అదనపు పని భారం
హైదరాబాద్, వెలుగు: బీఎస్‌ఎన్‌ఎల్‌లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్య 50 శాతానికి పైగా ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. దీంతో అటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇటు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కస్టమర్లకు సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి సంస్థలో ఉన్నోళ్లతోనే నడిపించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఐదుగురు చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారు. మార్చిలో మాత్రం.. రిటైరైన వాళ్లనే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇక ఉద్యోగులు లేక బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో చాలా విభాగాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
జనవరి 31న 4,880 మంది వీఆర్‌ఎస్
బీఎస్ఎన్‌ఎల్ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు కేంద్రం ఈ మధ్య వీఆర్‌ఎస్ అవకాశం కల్పించింది. దీంతో జనవరిలో దేశవ్యాప్తంగా 78 వేల మందికిపైగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తెలంగాణ సర్కిల్ పరిధిలో మొత్తం 8,081 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 5,096 మంది వీఆర్‌ఎస్‌కు అర్హులు ఉన్నారు. వీరిలో 4,880 మంది ఎంప్లాయీస్ జనవరి 31న వీఆర్‌ఎస్ తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్ పరిధిలో 3,700 మంది ఉద్యోగులు ఉండగా, 2,600 మంది వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
సర్వీసుల్లో అంతరాయం
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం చాలా చోట్ల రోడ్లు, ఇళ్ల నిర్మాణం, చెట్ల కొట్టివేత ఇతర కారణాలతో కేబుల్ వైర్లు తెగిపోతుంటాయి. ఇలా ఏదైనా సమస్య వచ్చి.. కస్టమర్లు ఫోన్ చేస్తే అంత త్వరగా పనులు జరగడం లేదు. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని అడ్జస్ట్ చేసినా ఔట్‌డోర్(బ్రాడ్‌బాండ్, ల్యాండ్‌లైన్) సిబ్బంది తక్కువ ఉన్నారు. దీంతో సేవల రీస్టోరేషన్‌లో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ వ్యవహారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే టెక్నికల్ పరంగా నెట్ వర్కింగ్‌లో ఇబ్బందులు కనిపించడం లేదు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రాల్లో కస్టమర్ సర్వీసులకు ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. వీటి ద్వారా మొబైల్ రీచార్జ్, బ్రాడ్‌బాండ్, ల్యాండ్‌లైన్ ఇతర మంత్లీ బిల్లులు కట్టించుకుంటారు. ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో ఆయా కేంద్రాల్లో రష్ ఉంటుంది. ప్రస్తుతం సిబ్బంది తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. హైదరాబాద్‌లోని ఓ టెలిఫోన్ భవన్‌లో కౌంటర్ల వద్ద 13 మంది పనిచేయాల్సి ఉండగా, నలుగురు మాత్రమే ఉంటున్నారు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి.
ఖాళీగా ఉన్న ఫ్లోర్లు అద్దెకు?
రాష్ట్రంలోని టెలిఫోన్ భవన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఫ్లోర్లకు ఫోర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అనేక సెక్షన్లలో ఒకరిద్దరు కూడా ఉండటం లేదు. దీంతో ఫ్లోర్లలోని ఉద్యోగులందరినీ ఒకే ఫ్లోర్ దగ్గరికి తరలిస్తున్నారు. హైదరాబాద్ టెలిఫోన్ భవన్‌లోని క్యాష్ కౌంటర్ డిపార్ట్‌మెంట్‌ను కస్టమర్ సర్వీస్ విభాగానికి మార్చారు. ఖాళీగా ఉన్న మిగతా ఫ్లోర్లను అద్దెకు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాల్లోనూ ఇలానే చేయాలని యోచిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో అసలు సిబ్బందే లేరని అధికారులు చెబుతున్నారు. మిగతా ఏరియాల్లో నలుగురు, ఐదుగురు చేసే పనిని ఒక్కరికే అప్పగించారు. అదనపు పని భారంతో టెలిఫోన్ భవన్‌లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరిగా పని చేయాల్సిందేనని, లేకుంటే మెమోలు జారీ చేస్తామని పై నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పెండింగ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటున్నారు.
రెండు నెలల ముందు నుంచే..
ప్రస్తుతమున్న వారితోనే సంస్థను కొనసాగించాలని పెద్దాఫీసర్లు భావిస్తున్నారు. ఉద్యోగులు లేని ఆఫీస్ లకు ఎక్కువున్న చోట నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. పని భారం ఉంటుందని రెండు నెలల ముందు నుంచే ఉద్యోగులను మెంటల్‌గా ప్రిపేర్ చేసినట్లు ఓ అధికారి చెప్పారు. నెట్‌వర్కింగ్ ఇబ్బందుల్లేకుండా రెండు నెలల ముందు నుంచే అడ్జస్ట్ చేశారు. మార్చి తర్వాత కొందరిని ఔట్‌సోర్సింగ్ ద్వారా తీసుకోనున్నారు.