ఫీజుల దోపిడీ అరికట్టాలి..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

ఫీజుల దోపిడీ అరికట్టాలి..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ ఆరోపించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఇంతలా దోచుకుంటున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఇబ్రాం శేఖర్ అధ్యక్షతన బీఎస్పీ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా చార్జీల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. జీవో నంబర్ 20 ప్రకారం.. పేద విద్యార్థులకు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాల్సి ఉందని శేఖర్ గుర్తుచేశారు. అయితే, ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ఈ జీవోకు అతీగతీ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. పిల్లల భవిష్యత్తుతో వ్యాపారం చేయడం ఆపాలన్నారు.