60 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు పీకే ఎందుకు?

60 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు పీకే ఎందుకు?
  • కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు
  • రేవంత్ రెడ్డి కుల అహంకారి
  • మతం పేరుతో బీజేపీ రాజకీయాలు
  • విచ్చలవిడి మద్యంతో పేదల బతుకులు చిధ్రం
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: ప్రగతి భవన్ గోడలు బద్దలు గొట్టే రోజులు దగ్గర పడ్డాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన... తనను బీఎస్పీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు.

తాను ఎన్నడూ పదవుల కోసం తాపత్రయపడలేదని, బీఎస్పీలో పని చేయడం నోబెల్ బహుమతి కన్నా గొప్పదని ఆనాడే చెప్పానని అన్నారు. మరింత బాధ్యతతో పని చేస్తూ... బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. తన 85 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని, వారి కష్టాలను తీర్చేందుకు బీఎస్పీ నిరంతరం కష్టపడుతుందని భరోసా ఇచ్చారు. యాత్రలో కంట్రోల్ బియ్యాన్నే బిర్యానీగా భావించే పేద తల్లుల ఆవేదన చూశానన్నారు. బెల్ట్ షాపుల వల్ల చిన్న వయసులోనే వితంతువులుగా మారిన గిరిజన స్త్రీలను కలిస్తే ఏడుపొచ్చిందన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల పాట్లు, ఇంకా కార్మికుల కన్నీళ్లు తనను కదిలించాయన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పులపాలయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారన్నారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు పీకే అవసరం దేనికని ఎద్దేవా చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉన్నత చదువుల  కోసం ఢిల్లీ వీధుల్లో నానా తంటాలు పడుతున్నారని, ఆర్ధిక సాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ చుట్టూ  కాళ్లరిగేలా తిరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ పేద పిల్లల చదువులకు కేటాయించిన నిధులను ఓట్ల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌజ్ టూర్, కేటీఆర్ ఫారెన్ విజిట్లకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెడ్లు అధికారంలోకే వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని రేవంత్ రెడ్డి కుల అహంకార వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అన్ని కులాలను సమానంగా చూసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో గల్ఫ్ లో ఉండే లక్షలాది మంది భారతీయుల జీవితాలను బీజేపీ చిక్కుల్లో నెట్టిందని మండిపడ్డారు. ఎక్కడ కష్టం ఉంటే బీఎస్పీ కార్యకర్తలు అక్కడ ఉండాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆకలికి, అహంకారానికి మధ్య జరిగే పోరాటంలో ప్రజలు బీఎస్పీని ఆదరించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కోరారు.